గవర్నర్‌ విధుల కట్టడికి సీఎం కేసీఆర్‌ కుట్ర

గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 26 Jan 2023 05:03 IST

రిపబ్లిక్‌ డేపై అప్రజాస్వామిక ధోరణి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ఆనవాయితీ ప్రకారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన విధులను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పన్నుతున్న కుట్రలో ఇది భాగమే అని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంచడం అవమానించడమే అని అన్నారు. సీఎం బహిరంగసభలకు అడ్డురాని కరోనా నిబంధనలు గణతంత్ర వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. వేడుకలు ఘనంగా నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని సంజయ్‌ మరో ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రానికి ప్రతి నెలా మోదీ, షా, నడ్డాలో ఒకరు: లక్ష్మణ్‌

‘పల్లె గోస-భాజపా భరోసా’ పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఆయన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాల్లో ఎవరో ఒకరు ప్రతినెలా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. ఈనెల 27న జరిగే పరీక్షా పే చర్చకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని అయిదు పాఠశాలల్లో మోదీ ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సీఎంది నియంతృత్వం: ఈటల

రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే కొనసాగించాలనుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గణతంత్ర వేడుకలను పరేడ్‌ మైదానంలో నిర్వహించకపోవడం దారుణమన్నారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. ప్రగతిభవన్‌ కేంద్రంగా తనపై కుట్రలు జరుగుతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని