ఎస్సీ, ఎస్టీలపై వైకాపా వివక్ష

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల అన్ని విషయాల్లోనూ వైకాపా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని దళిత, గిరిజన సంఘాల నాయకులు, జనసేన పార్టీ నేతలు ధ్వజమెత్తారు.

Updated : 26 Jan 2023 05:51 IST

ఉప ప్రణాళిక నిధుల్ని మళ్లిస్తూ తీరని అన్యాయం
27 ప్రత్యేక పథకాలూ రద్దు
పైగా ఎంతో అభివృద్ధి చేశామంటూ మంత్రుల గొప్పలా?
దళిత, గిరిజన సంఘాలు, జనసేన నేతలు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల అన్ని విషయాల్లోనూ వైకాపా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని దళిత, గిరిజన సంఘాల నాయకులు, జనసేన పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధుల్ని ముఖ్యమంత్రి జగన్‌ ఇతర పథకాలకు మళ్లిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్ల పాలనలో చట్టం ప్రకారం కేటాయించాల్సిన దానిలో రూ.20 వేల కోట్లు కోత వేసి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. దళితుల పిల్లలకు మేనమామ అంటూనే ఏన్నో ఏళ్లుగా వారి కోసమే అమలవుతున్న 27 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. పైగా ఎస్సీ, ఎస్టీలను ఎంతో అభివృద్ధి చేశామంటూ మంత్రులు గొప్పలు చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం’ అంశంపై జనసేన నిర్వహించిన సదస్సులో దళిత, ఆదివాసీ సంఘాలు, పార్టీ నేతలు మాట్లాడారు.

ప్రత్యేక ఖర్చు శూన్యం  
- నాదెండ్ల మనోహర్‌, జనసేన రాజకీయ     వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌


బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు చూపించి, వాటిని ఇతర పథకాలకు వినియోగిస్తూ ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తున్నారు. నవరత్నాలు పేరు చెప్పి ఉప ప్రణాళిక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న తీరు చూస్తే బాధేస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క దళితవాడ, ఆదివాసీ తండా అభివృద్ధి చెందలేదు. అన్నింటా వివక్షే. దీన్ని ప్రశ్నించకుండా ముఖË్యమంత్రి జగన్‌ భయపెట్టి పాలించాలని చూస్తున్నారు. తమకు హక్కుగా రావాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదో యువత ప్రశ్నించాలి.


ప్రత్యేక అభివృద్ధి నిధిగా ఎందుకు మార్చరు?
- వరప్రసాద్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

తెలంగాణ ప్రభుత్వం ఉపప్రణాళికను ప్రత్యేక అభివృద్ధి నిధిగా మార్చి అమలు చేస్తోంది. వైకాపా ప్రభుత్వం ఎందుకు ఇలా సవరణలు చేయడం లేదు? 2022-23లో ఎస్సీలకు రూ.32 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటే.. రూ.18,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎస్టీలకు రూ.8,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటే కేటాయించింది రూ.6 వేల కోట్లే. ఇచ్చిన దాంట్లోనూ ఖర్చు చేసింది 32 శాతమే? ఇదేనా గొప్పగా చేయడమంటే?


పాలేర్లలా మార్చేస్తున్నారు
- విజయ్‌పాల్‌ దివాకర్‌, నేషనల్‌ క్యాంపెయిన్‌  ఫర్‌ దళిత్‌ హ్యూమన్‌ రైట్స్‌ నేత

రాజ్యాంగం ద్వారా హక్కుగా అందాల్సిన నిధుల్ని కేటాయించకుండా ఎస్సీ, ఎస్టీలను పాలేర్లలా మార్చి పథకాల రూపంలో ఇస్తామంటున్నారు. ఇతర వర్గాలతో ఉన్న అసమానతలు తొలగించేలా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. 10 ఏళ్లలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక కింద రూ.1.54 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే రూ.1.06 లక్షల కోట్లే కేటాయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకే ప్రత్యేకంగా కేటాయించింది రూ.41 వేల కోట్లు మాత్రమే. ఖర్చు చేసింది రూ.30 వేల కోట్లే. దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఎస్సీ, ఎస్టీలను చైతన్యపరచాల్సిన బాధ్యత పవన్‌ కల్యాణ్‌పై ఉంది.


చేపలివ్వడం కాదు.. పట్టడం నేర్పించాలి
- సుధాకర్‌, ప్రొఫెసర్‌

ఎస్సీ, ఎస్టీల కేంద్రంగా వ్యక్తి, కుటుంబం, ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల్ని వినియోగించాలని చట్టం చెబుతోంది. ఎవరికైనా చేపనిస్తే ఆ పూటకు తిని బతుకుతారు. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతారు. ఏ విధానాన్ని అమలు చేస్తున్నామో ప్రభుత్వం నిజాయతీగా ఆలోచించాలి. చేపనిస్తూ గొప్పగా మేలు చేస్తున్నామనడం ఎస్సీ, ఎస్టీలను మోసగించడమే.


రేషన్‌ ఇవ్వడమే అభివృద్ధా?
- మోహన్‌కుమార్‌ ధర్మా, అఖిలభారత ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు

దళితవాడలు, గిరిజన తండాల్లో తాగునీరు, రహదారులు, వీధిదీపాలు, ఇతర మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాలని చట్టం చెబుతుంటే వైకాపా ప్రభుత్వం మాత్రం రేషన్‌, పింఛను ఇస్తున్నామంటోంది. మూడున్నరేళ్లలో ఒక్క రోడ్డూ వేయలేదు. దళితులెవరికీ ఎకరా భూమీ ఇవ్వలేదు. ఉన్న భూములకు పట్టాలివ్వలేదు. పట్టాలుంటేనే రైతు భరోసా అంటున్నారు. మరి ఎస్సీ, ఎస్టీలకు రైతు భరోసాతో ఎలా మేలు చేసినట్లు?


ఎస్సీ, ఎస్టీల ఓట్లు చీలకూడదు
- అప్పలరాజు, విశ్రాంత, ఐఆర్‌ఎస్‌ అధికారి

ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి అవకాశాల్లేవు. ఆదాయం పూర్తిగా పడిపోయింది. వారి దగ్గరుండే ఒకే ఒక అస్త్రం ఓటు. జరుగుతున్న అన్యాయంపై చైతన్యం కావాలి. ఓట్లు చీలిపోకూడదు. నిధులు మళ్లించడం ఒక్కటే సమస్య కాదు. అవి ఎక్కడికెళుతున్నాయి, వేటికి వినియోగిస్తూ ప్రభుత్వాలు ఎలా ప్రచారం చేస్తున్నాయి అనేది అందరూ గమనించాలి.


అబద్ధాలు చెబుతూ మోసం
- పాడిబండ్ల ఆనందరావు, దళిత హక్కుల నేత

ఉప ప్రణాళిక నిధుల్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. పైగా పాలకులు అబద్ధాలు చెబుతూ ఎస్సీ, ఎస్టీలను దారుణంగా మోసగిస్తున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం అధికారులు, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీలపై ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ బాధ్యతను పవన్‌ కల్యాణ్‌, జనసేన తీసుకోవాలి.


కుండకు చిల్లు పెట్టి నీళ్లు నింపి ఇచ్చినట్లే..
- రామచంద్రయ్య, ఏపీ యానాది సంక్షేమ సంఘం నాయకుడు

కుండకు చిల్లు పెట్టి, నిండుగా నీటిని నింపి ఇచ్చినట్లు ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మభ్యపెడుతోంది. కుళాయి ద్వారా నీటిని తీసుకుందామంటే కుదరదు. రంధ్రం ద్వారా ఎంత నీటినైనా ప్రభుత్వం లాగేసుకుంటోంది. ఉపప్రణాళిక అమలు తీరు కూడా ఇలానే ఉంది.


ఎస్సీ, ఎస్టీల మనుగడే ప్రశ్నార్థకం
- గంగులయ్య, గిరిజన సంఘం నేత

సీఎం జగన్‌ ఉప ప్రణాళిక చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ, ఎస్టీల మనుగడను ప్రశ్నార్థకం చేశారు. గిరిజన బిడ్డలకు మంచి విద్య అందకుండా బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారు. యువతకు ఉపాధి కల్పన లేకుండా కార్పొరేషన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టారు. గ్రామసభ ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో ఏ పనీ చేపట్టకూడదని రాజ్యాంగం చెబుతున్నా.. దాన్ని తుంగలో తొక్కి కడపకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు పవర్‌ ప్రాజెక్టును కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.


జనసేన డిక్లరేషన్‌

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం కాలపరిమితిని ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించడం కంటి తుడుపు చర్యే. సమగ్ర ప్రణాళిక తయారీ, నిధుల కేటాయింపు, వినియోగంపై దృష్టిసారించి నిర్దిష్ట కార్యాచరణతో పూర్తిస్థాయి ప్రత్యేక నిధి చట్టంగా రూపొందించాలని ఎస్సీ, ఎస్టీల పక్షాన తీర్మానిస్తున్నాం. మేం అధికారంలోకి వస్తే ఎస్సీ కార్పొరేషన్‌ను పరిపుష్ఠం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకొస్తాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని