ఎమ్మెల్యే వేధింపులతో రాజీనామా చేస్తున్నా

జగిత్యాల పురపాలకసంస్థ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌కు రాజీనామా లేఖను అందజేశారు.

Published : 26 Jan 2023 05:03 IST

సంజయ్‌కుమార్‌ అడుగడుగునా అవమానించారు
ఆయన వల్ల మాకు ప్రాణభయం
కన్నీటిపర్యంతమైన జగిత్యాల పురపాలిక ఛైర్‌పర్సన్‌ శ్రావణి

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల పురపాలకసంస్థ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వేధింపులు భరించలేక రాజీనామా చేస్తున్నానంటూ శ్రావణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే సంజయ్‌ అడుగడుగునా తనను అవమానపరిచారని ఆమె విలేకరుల సమావేశంలో రోదిస్తూ వెల్లడించారు. ఆయన డబ్బులు కూడా డిమాండ్‌ చేశారని ఆరోపించారు. నడిరోడ్డులో అమరవీరుల స్తూపం సాక్షిగా అవమానానికి గురయ్యానన్నారు. ఎమ్మెల్యే స్నేహితుని కోసం కొత్తబస్టాండులో జంక్షన్‌ను చిన్నగా మార్చారని, కమిషనర్‌ను సస్పెండ్‌ చేయిస్తామని బెదిరించడంతో ఆయన సెలవులో వెళ్లారని వివరించారు. ‘ఈ మూడేళ్లు నరకయాతన అనుభవించా. ఎమ్మెల్యే ఇచ్చిన స్క్రిప్టును మాత్రమే నేను చదవాలి. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితల పేర్లు ప్రస్తావించడానికి కూడా వీలు లేకుండా చేశారు’ అని శ్రావణి ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకుంటున్నానన్నారు. తనకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ నేపథ్యం

నాలుగు రోజుల కిందట ఎమ్మెల్యే సంజయ్‌ 27 మంది భారాస కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. శ్రావణికి వ్యతిరేకంగా వారంతా లేఖ రాసి ఇచ్చారు. ఆ లేఖను ఎమ్మెల్యే సంజయ్‌ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అందించినట్లు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బోగ వెంకటేశ్వర్లు భారాసలో చేరారు. అనంతరం జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆయన కోడలు శ్రావణి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. శ్రావణి దంపతులు మొదటి నుంచీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితలకు సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే సంజయ్‌కు, శ్రావణి మామ వెంకటేశ్వర్లుకు మనస్పర్థలు పొడసూపినట్లు ప్రచారం జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు