Yuvagalam : కడపలో లోకేశ్‌కు జన నీరాజనం

పాదయాత్ర శ్రీకారం చుట్టడానికి వెళుతూ కడప వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఘనంగా ఆశీస్సులు లభించాయి.

Updated : 26 Jan 2023 06:34 IST

ఈనాడు డిజిటల్‌, కడప: పాదయాత్ర శ్రీకారం చుట్టడానికి వెళుతూ కడప వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఘనంగా ఆశీస్సులు లభించాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌కు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వందల వాహనాల్లో నేతలు.. కార్యకర్తలు భారీర్యాలీగా తరలిరాగా ముందుగా దేవుని కడపలో లక్ష్మీసమేత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం కడప పెద్దదర్గాకు చేరుకున్నారు. దర్గాలో మతపెద్దలు స్వాగతం పలికారు. అక్కడ చాదర్‌ తలపైన పెట్టుకుని దర్గా లోపలికి వెళ్లి మజార్లకు సమర్పించారు. అక్కడినుంచి మరియాపురంలోని రోమన్‌ కేథలిక్‌ చర్చికి చేరుకున్న లోకేశ్‌కు.. చర్చి ఫాదర్‌, పాస్టర్లు స్వాగతం పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆశీర్వాదం అందజేశారు. అనంతరం బయటకొచ్చిన లోకేశ్‌ ప్రజలకు అభివాదం చేయగా.. అందరూ సీఎం... సీఎం అంటూ నినదించారు. లోకేశ్‌ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప పర్యటన ముగించుకుని రాత్రి 8.30కు రాయచోటి, పీలేరు, భాకరాపేట మీదుగా తిరుపతి చేరుకుని అక్కడినుంచి తిరుమలకు వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు