లోకేశ్‌ను చూస్తే జగన్‌రెడ్డికి ఎందుకంత వణుకు?

‘లోకేశ్‌ పాదయాత్రలో ట్రాఫిక్‌ను, జనాన్ని నియంత్రించడం, శాంతిభద్రతల నిర్వహణ, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాల ఏర్పాటు వంటివన్నీ నిర్వాహకులే చేస్తే, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులేం చేస్తారు డీజీపీ గారూ?

Updated : 26 Jan 2023 12:09 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపాటు

ఈనాడు, అమరావతి: ‘లోకేశ్‌ పాదయాత్రలో ట్రాఫిక్‌ను, జనాన్ని నియంత్రించడం, శాంతిభద్రతల నిర్వహణ, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాల ఏర్పాటు వంటివన్నీ నిర్వాహకులే చేస్తే, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులేం చేస్తారు డీజీపీ గారూ? మొత్తం పాదయాత్రకు అనుమతివ్వాలని మేం కోరితే... పలమనేరు డీఎస్పీ మూడు రోజులకు అనుమతివ్వడమేంటి? ఆ తర్వాత మరో డీఎస్పీ అనుమతితో పాదయాత్ర చేయాలా? అలా 400 రోజుల పాదయాత్రలో 120 మంది డీఎస్పీలను అనుమతి కోసం దేబిరించాలా’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘లోకేశ్‌ పాదయాత్రపైనే ఎందుకన్ని ఆంక్షలు? ఆ కుర్రాడిని చూసి ఎందుకలా వణికిపోతున్నారు సీఎం గారూ?’ అని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామయ్య దుయ్యబట్టారు. లోకేశ్‌ పాదయాత్రపై విధించిన ఆంక్షల్ని తొలగించాలని, మైక్‌, సౌండ్‌సిస్టమ్‌లకు అనుమతివ్వాలని, 400 రోజుల పాదయాత్రకు ఒకేసారి అనుమతివ్వాలని, యాత్ర పొడవునా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత ఎస్పీలు, సీపీలను ఆదేశించాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రామయ్య బుధవారం లేఖ రాశారు. పలమనేరు డీఎస్పీ పలు ఆంక్షలు విధించడాన్ని తప్పుబడుతూ చిత్తూరు ఎస్పీకి మరో లేఖ రాశారు.

హాస్యాస్పదం...: లోకేశ్‌ పాదయాత్రకు మూడు రోజులపాటు అనుమతిస్తూ పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పెట్టిన 15 నిబంధనలు హాస్యాస్పదంగా ఉన్నాయని రామయ్య ధ్వజమెత్తారు. ‘2017లో జగన్‌ పాదయాత్రకు ఒకేసారి అనుమతిస్తూ అప్పటి డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అలా ఎందుకు చేయరు? మేం మూడు రోజులకోసారి ప్రతి డీఎస్పీ వద్దకూ వెళ్లి దేహీ అని బతిమాలుకోవాలన్నది డీజీపీ ఉద్దేశమా? పోలీసుశాఖను రాజేంద్రనాథ్‌రెడ్డి నడపడం లేదు. వెనుక ఎవరో ఉన్నారు’ అని రామయ్య విమర్శించారు. పాదయాత్రలో లోకేశ్‌ తొలి అడుగు పడేసరికే డీజీపీ అన్ని అనుమతులూ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు