రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం

రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే ఈ రోజు నుంచి జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆయన బుధవారం దర్శించుకున్నారు.

Updated : 26 Jan 2023 06:55 IST

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను ప్రార్థించా
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- ఇంద్రకీలాద్రి: రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే ఈ రోజు నుంచి జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆయన బుధవారం దర్శించుకున్నారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో వేద పండితులు పవన్‌కు స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించిన పవన్‌ అంతరాలయంలో పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయంవద్ద తన ప్రచార రథం వారాహికి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన వీర మహిళలు 100 బిందెల నీళ్లతో వారాహికి పూజలు చేశారు. అనంతరం వారాహి పై నుంచి పవన్‌ ప్రసంగించారు. అమ్మవారి మంగళ వాయిద్యాలే తమ బలమని, ఈ రోజు నుంచి రాక్షస పాలన అంతమే లక్ష్యంగా వారాహి దూసుకెళుతుందని పవన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, నాయకులు పోతిన మహేష్‌, అమ్మిశెట్టి వాసు, అక్కల గాంధీ, తంగెళ్ల ఉదయ్‌, మండలి రాజేష్‌, బూరగడ్డ శ్రీకాంత్‌, కిషోర్‌, బొలియాశెట్టి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయానికి వారాహిపైనే: దుర్గమ్మకు పూజలు చేసి, కిందకు వచ్చిన పవన్‌ తన ప్రచార రథంపైకి ఎక్కి జనసైనికులు, అభిమానులకు అభివాదం చేస్తూ మంగళగిరి పార్టీ కార్యాలయం వరకూ వెళ్లారు. దారిపొడవునా అభిమానులు పూలవర్షం కురిపిస్తూ, హారతులు పట్టారు. గజమాలలతో పవన్‌ను సత్కరించారు. ర్యాలీ సీతమ్మ వారి పాదాల వద్దకు వచ్చేసరికి.. ఓ 108 అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో పవన్‌ వెంటనే వారాహిని పక్కన ఆపించి అంబులెన్స్‌కు దారి ఇప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు