Pawan Kalyan: ఇలాంటి సీఎం.. మళ్లీ కావాలా?

‘మా బిడ్డ జైలుకెళ్లారు.. కష్టపడి నడుస్తున్నారు’ అంటూ జగన్‌ను నమ్మిన జనం ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రజలనూ ఆయన మోసం చేశారు.

Published : 27 Jan 2023 05:26 IST

ప్రజలంతా ఆలోచించాలి
నమ్మిన ప్రజలను మోసం చేశారు
కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారు
సొంత మంత్రి ఇంటినీ తగలబెట్టించారు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజం
రాష్ట్ర భవిష్యత్తు కోసమే తన వ్యూహాలని వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘మా బిడ్డ జైలుకెళ్లారు.. కష్టపడి నడుస్తున్నారు’ అంటూ జగన్‌ను నమ్మిన జనం ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రజలనూ ఆయన మోసం చేశారు. అలాంటి జగన్‌పై జాలి ఎందుకు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా పైరవీలతో రూ.కోట్లు సంపాదించుకున్నారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలనుకున్నారు. ఇదేమైనా రాచరికమా? యువకుడిగా ఉన్నప్పుడు ఒక పోలీసు అధికారిని పులివెందులలో కొట్టారు ఈ ముఖ్యమంత్రి’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి సీఎం మనకు మళ్లీ కావాలా అని ప్రజలంతా ఆలోచించాలని.. అయిదుగురు చొప్పునో పది మంది చొప్పునో తర్కంతో చర్చించుకుని నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ‘రూ.5,000 ఇచ్చి వాలంటీరు ఉద్యోగం ఇస్తే సరిపోతుందా మీకు? మీరు రూ.5వేలకు ఊళ్లలోనే ఉండిపోతారా.. ఐటీ మంత్రికి 6వేల ఎకరాలున్నాయట’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు కీలకమని, అందుకే నేరాల్లేని ఆంధ్రప్రదేశ్‌ను జనసేన కోరుకుంటోందని తెలిపారు. ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావు.. మరోసారి భాజపాతో ఉంటావని తనను ప్రశ్నిస్తుంటారని.. తాను మధ్యలోనే ఉంటానని, ప్రజల కోసమే ఎజెండాలు మారుస్తుంటానని జనసేన అధినేత స్పష్టం చేశారు. తన వ్యూహాలు తనకోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని చెప్పారు. జనసేనకు ఇప్పటికిప్పుడు అధికారం ఇస్తే సరేకానీ, ఆ పరిస్థితి లేకపోతే అది వచ్చేవరకూ సామరస్యంగా నిరీక్షించాల్సిందేనని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.

విడగొడతాం అంటే తోలు తీస్తాం

‘ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని అంటున్నారని, వైకాపాకు అధికారం రాకపోతే మీకు ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చేయాలా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావును   పవన్‌ నిలదీశారు. ‘రాయలసీమలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలాగే అన్నారు. ఎవరైనా సరే వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే నా అంత తీవ్రంగా స్పందించేవారు మరొకరు ఉండరు. మరోసారి రాష్ట్రాన్ని విడగొడతాం అంటే తోలు తీసి కూర్చోబెడతాం. మాట్లాడితే రాయలసీమ, రాయలసీమ అంటారు. రాయలసీమకు మీరు ఏం చేశారు? ఎందుకు దాన్ని కాపాడుకోలేకపోయారు? సీమ నుంచి ఎందరో వలసలు వెళ్లిపోతున్నారు’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

ఈ సీఎంలా కులాల మధ్య గొడవలు పెట్టను

‘తెలంగాణ లాంటి తిరుగుబాటు ధోరణి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడో బాగుపడేది. అన్యాయం జరిగితే వాళ్లు రోడ్లపైకి వస్తారు. ఏపీ ప్రజలకు కులం మీద ఉన్న పిచ్చి ఆంధ్ర జాతి మీద లేదన్నది వాస్తవం. ఈ సీఎంలా నేను కులపిచ్చి ఉన్నవాణ్ణి కాదు. కులాల తాలూకు అసమానతలు అర్థం చేసుకున్న భారతీయుణ్ని. ఈ సీఎం కోనసీమలో 3, 4 కులాల మధ్య ఘర్షణలు పెట్టేశారు. సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించేశారు. అందుకే ఆయన ఇప్పటి వరకూ మంత్రి విశ్వరూప్‌ను పరామర్శించేందుకు వెళ్లలేదు. ఈ ఆధిపత్య ధోరణి ఉన్నంతవరకు రాష్ట్రం బాగుపడదు. యువత ఇక్కడి కుల యుద్ధాలను అర్థం చేసుకుని సరిగా వ్యవహరించకపోతే అభివృద్ధి తమిళనాడుకో, గుజరాత్‌కో, యూపీకో, బిహార్‌కో తరలిపోతుంది’ అని పేర్కొన్నారు.

సీఎం అయిపోవాలని కలలు కనడం లేదు..

‘పార్టీ నిర్మాణం అంత సులభం కాదు. లక్ష మందిని ఒక చోటకు తీసుకొచ్చి పాలసీ చెప్పి ఒప్పించగలరా? నా తాత, నాయన ఎవరూ ముఖ్యమంత్రులు కాదు, మా బాబాయిలు ఎంపీలు కాదు. ఎంతో కష్టపడుతున్నాం. పార్టీ నిర్మాణం అంటే దశాబ్దం నిరీక్షించాలి. ఆ తర్వాత ఎటువైపు వెళుతుందో చూద్దాం. నేను ముఖ్యమంత్రిని అయిపోవాలని కలలు కనడం లేదు. ప్రజలు అంగీకరించి ఓట్లేస్తేనే సీఎం అవుతా. మనం తొలుత రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్‌కు బలమైన రాజకీయ స్థిరత్వం ఉంటేనే అభివృద్ధి వస్తుంది. అది జనసేనవల్ల సాధ్యమవుతుందని ప్రజలు అనుకుని అధికారం ఇచ్చే వరకు సామరస్యంగా నిరీక్షిద్దాం’ అని జన సైనికులకు ఉద్బోధించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని పవన్‌ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం, హేతువాదం పేరుతో హిందూ దేవుళ్లను విమర్శించి, ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం తగదని, ఏ మతం వారిని అవమానించినా తానే ముందు స్పందిస్తానని చెప్పారు. 

ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే: మనోహర్‌

జనసేన కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయదని.. ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. రాబోయే ఏడాది కాలం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే ఉన్న 3.60 లక్షల మంది సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు కొత్తవారిని సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం చేపడదామని, ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరపున న్యాయవాదులను నియమించబోతున్నామని వివరించారు.


జనసేనలోకి విశాఖ కార్పొరేటర్‌

జీవీఎంసీ 32వ వార్డు ఇండిపెండెంట్‌ (వైకాపా మద్దతుదారు) కార్పొరేటర్‌ కందుల నాగరాజు తన అనుచరులతో కలిసి గురువారం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు