సంక్షిప్త వార్తలు(6)

స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు వర్గాలకు చేర వేసే విధంగా పాలకుల తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

Updated : 27 Jan 2023 05:49 IST

స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి: జ్ఞానేశ్వర్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు వర్గాలకు చేర వేసే విధంగా పాలకుల తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జండానూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. గురువారం కాసాని సమక్షంలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన వివిధ కుల సంఘాల వారు, పార్టీల నాయకులు తెదేపాలో చేరారు.


రాజ్యాంగాన్ని కేసీఆర్‌ అవమాన పరిచారు: షర్మిల

ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ గణతంత్ర దినోత్సవం నిర్వహించకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచారని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వేడుకలను విస్మరించినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారమిక్కడ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను వైఎస్‌ షర్మిల ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గణతంత్ర వేడుకలను విస్మరించి సీఎం తెలంగాణ ప్రజలనే కాదు.. దేశ ప్రజలనూ అగౌరవపరిచారు’ అని పేర్కొన్నారు. సీఎం పదవిలో ఉండే అర్హత కేసీఆర్‌కు లేదని.. ఎన్నికలకు పోవాలని సూచించారు.


30న ‘అనాథల హరిగోస’ మహాదీక్ష
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 74 వసంతాలు అవుతున్నా.. వాటి ఫలాలు అనాథలకు అందడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 30న ఇందిరాపార్కు వద్ద ‘అనాథల హరిగోస’ పేరుతో మహాదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు.


నావల్లే 2018లో కాంగ్రెస్‌కి అధికారం: గహ్లోత్‌

జైపుర్‌: మునుపటి తన పనితీరు వల్లనే 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రాగలిగిందని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ చెప్పారు. 2013 నుంచి 2018 వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన పోరాటం వల్లనే 2018లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పరోక్షంగా ఖండించారు. తాను గతంలో చేసిన అభివృద్ధి వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. తాజా వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది.


జోడో ముగింపునకు రాలేమన్న జేడీయూ

దిల్లీ: భారత్‌ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి తాము హాజరుకావడం లేదనీ, ఆ యాత్ర మాత్రం చరిత్రాత్మకమైనదని జనతాదళ్‌(యూ) అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లలన్‌) పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భాజపాయేతర పార్టీలను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఖర్గేకు లలన్‌ గురువారం లేఖ రాశారు. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘నాగాలాండ్‌లో ఎన్నికలకు సంబంధించి కార్యక్రమం ఉండటంతో భారత్‌ జోడో ముగింపునకు మేం రాలేకపోతున్నాం. మా పార్టీతోపాటు అధినేత నీతీశ్‌ కుమార్‌ తరఫున ఈ కార్యక్రమ విజయాన్ని ఆకాంక్షిస్తున్నాం. 2024 ఎన్నికల కోసం ఉమ్మడిగా వ్యూహాలను రూపొందించి ముందుకెళ్తామని భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

* ఒకరోజు విరామం తర్వాత రాహుల్‌గాంధీ శుక్రవారం తన యాత్రను కొనసాగించి కశ్మీర్‌ లోయలో అడుగుపెట్టనున్నారు.


ఏపీలో జీవో-1 రద్దయ్యే వరకు పోరు
వామపక్షాలు

ఈనాడు, అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉత్తర్వు-1 తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక జీవో-1 రద్దయ్యే వరకూ పోరు కొనసాగిస్తామని విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహంవద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిస్తున్నాయి. నిరంకుశ పాలన సాగిస్తున్నాయి. జీవో-1 రాజ్యాంగ విరుద్ధమైనది. ప్రజల నిరసనలను అణచివేసే దురుద్దేశంతో దీనిని ప్రభుత్వం తీసుకొచ్చింది. మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో సాగిన మారణకాండను బహిర్గతం చేసిన బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం అప్రజాస్వామికం’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు