తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటా విస్తరించాలి

తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఛత్రపతి శివాజీ వంశీయుడు, కొల్హాపూర్‌ సంస్థాన వారసుడు, మాజీ ఎంపీ శంభాజీ రాజె ఛత్రపతి ఆకాంక్షించారు.

Published : 27 Jan 2023 04:23 IST

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ   వంశీయుడు శంభాజీ రాజె
ప్రగతిభవన్‌లో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఛత్రపతి శివాజీ వంశీయుడు, కొల్హాపూర్‌ సంస్థాన వారసుడు, మాజీ ఎంపీ శంభాజీ రాజె ఛత్రపతి ఆకాంక్షించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. శంభాజీ  రాజెను సీఎం సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రగతి, అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన గురించి సీఎం ఆయనకు వివరించారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించుకున్నారు.  సీఎం మాట్లాడుతూ.. శంభాజీ రాజె పూర్వీకులు శివాజీ మహరాజ్‌ నుంచి సాహూ మహరాజ్‌ దాకా ఈ దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు. సమానత్వం, ప్రజాసంక్షేమం దిశగా వారందించిన పాలన దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. వారి స్ఫూర్తితో కుల, మత వివక్షకు తావు లేకుండా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు.

భారాసలోకి ఆహ్వానం..

ఈ సందర్భంగా శంభాజీని భారాసలోకి సీఎం ఆహ్వానించారు. పార్టీ మహారాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరారు. దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు పార్టీని స్థాపించామని వివరించారు. శంభాజీ మాట్లాడుతూ.. దేశ ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండాతో సీఎం కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితిని ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. త్వరలోనే తాము మరోసారి కలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహూ ఛత్రపతి’ పుస్తకాన్ని శంభాజీ సీఎంకు బహూకరించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, భారాస ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని