కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యోగాలు పోతేనే.. యువతకు కొలువులు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే గ్రామీణుల బతుకులు మారుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రను వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లిలో ప్రారంభించారు.

Published : 27 Jan 2023 04:23 IST

‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే గ్రామీణుల బతుకులు మారుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రను వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు కులమతాల మధ్య చిచ్చుపెడుతూ.. రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ నివాసాలు, ఉచిత విద్య, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాలతో పాటు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమైనట్లు రేవంత్‌ గుర్తు చేశారు. భారాస రెండు పడక గదుల ఇళ్లు, రూ.లక్ష రుణమాఫీ, ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపులేదని.. రైతులకు గిట్టుబాటు ధరలు, రాయితీ పథకాలు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.  కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యోగాలు ఊడితేనే రాష్ట్రంలోని యువతకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆగిపోవని రేవంత్‌ భరోసా ఇచ్చారు. బొంరాస్‌పేటలో పొలాల్లోకి వెళ్లి మహిళా కూలీలతో మాట్లాడారు. అనంతరం కొడంగల్‌కు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని