భాజపా అధికారంలోకి వస్తోంది

తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ప్రాతిపదికగా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందిస్తామన్నారు.

Published : 27 Jan 2023 04:23 IST

ప్రజల సమస్యలే మ్యానిఫెస్టో
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ప్రాతిపదికగా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందిస్తామన్నారు. తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు అందిస్తోందని, గ్రామాల్లో నడిచే ప్రతి అభివృద్ధి పనికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మహిళా మోర్చా నేతల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ మహిళా విధానాల పరిశోధన విభాగం ఇన్‌ఛార్జి కరుణాగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయాలని, మహిళలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించాలని మోర్చా నేతలకు సంజయ్‌ సూచించారు. గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఉత్తమ పథకాలపై అధ్యయనం చేయాలని కోరారు. విపత్తులతో నష్టపోయిన రైతులందరికీ తమ ప్రభుత్వం రాగానే పరిహారం చెల్లిస్తామన్నారు.

* డీఎస్సీ-2008 మెరిట్‌ అభ్యర్థుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయడంలేదని.. తమకు న్యాయం చేసేలా తోడ్పాటును అందించాలని అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయనను కలసి వినతిపత్రం అందచేశారు.


రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది

తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోందని బండి సంజయ్‌ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ జెండా ఎగురవేశారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం, కోర్టుల పట్ల గౌరవంలేదని గణతంత్ర దినోత్సవ నిర్వహణకు కోర్టుకు వెళ్లాల్సి రావడం దారుణమన్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌, ప్రధాని మోదీల స్ఫూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పోరాడతామని ప్రకటించారు. పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయశాంతి, ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మనోహర్‌రెడ్డి, రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని