ఆ‘మోదీ’యమే!

లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమేననీ, ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్రమోదీయే అని ‘ఇండియా టుడే’ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.

Published : 27 Jan 2023 05:25 IST

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేదే గెలుపు
కేంద్రంలో కూటమిపై 67% మంది సంతృప్తి
జోడో యాత్రతో కాంగ్రెస్‌కు ప్రయోజనం అంతంతే
‘ఇండియా టుడే-  సీ వోటర్‌’ సర్వేలో వెల్లడి

దిల్లీ: లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమేననీ, ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్రమోదీయే అని ‘ఇండియా టుడే’ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ పేరుతో  సీవోటర్‌తో కలసి దీనిని నిర్వహించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 67% మంది తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఆర్థిక అంశాలను, చైనా ముప్పును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం బాగానే వ్యవహరించిందని వారు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగితే భాజపా 284 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కి 191 స్థానాలు రావచ్చని తెలిపింది.

ప్రధానికి తరగని ఆదరణ

ప్రధాని మోదీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టుడే అంచనా. ఆయన పనితీరుపట్ల 72% మంది సంతృప్తి వ్యక్తపరిచారు. ‘ద్రవ్యోల్బణం, కరోనా ప్రభావం, చైనా దురాక్రమణల ముప్పు వంటివి ఉన్నా ప్రజా వ్యతిరేకతను ఎన్డీయే సర్కారు అధిగమించింది. మూడింట రెండొంతుల మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారు. 2022 ఆగస్టులో 11% మంది మాత్రమే సంతృప్తితో ఉండడం గమనార్హం. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తపరిచినవారు అప్పుడు 37% ఉంటే ఇప్పుడు 18 శాతమే.

దేశంలో 1,40,917 మంది నుంచి అభిప్రాయాలను ఇండియా టుడే తెలుసుకుంది. మరో 1,05,008 మంది ఇంటర్వ్యూలను సీవోటర్‌ అదనంగా తీసుకుంది. ఏ అంశాలను ఎన్డీయే విజయాలుగా భావిస్తున్నారనే ప్రశ్నకు 20% మంది ప్రజలు.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి చెప్పారు. 370వ అధికరణం రద్దు గురించి 14% మంది, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 12% మంది చెప్పారు.

*  జోడో యాత్రతో కాంగ్రెస్‌ జాతకం మారదని 37% మంది, ప్రజలతో విస్తృతంగా అనుసంధానం అయ్యేందుకు ఈ యాత్ర ఓ గొప్ప ప్రయత్నమని 29% మంది చెప్పారు. కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి రాహుల్‌గాంధీ తగిన వ్యక్తి అని 26%, సచిన్‌ పైలట్‌ పేరును 17% మంది సమర్థించారు. ప్రతిపక్ష సారథ్యానికి అరవింద్‌ కేజ్రీవాల్‌కు 24%, మమతా బెనర్జీకి 20%, రాహుల్‌గాంధీకి కేవలం 13% మద్దతు లభించింది. ప్రతిపక్ష కూటమి ప్రధాని మోదీని ఎదుర్కోగలదా అనే ప్రశ్నకు ఏడాదిలో సానుకూల అభిప్రాయం 10 శాతం తగ్గింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు