రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి అవసరం

రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 27 Jan 2023 06:02 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘విజన్‌- 2047’తో ప్రణాళికాబద్ధంగా సాగితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని తెలిపారు. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్‌ సామర్థ్యం, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారతదేశానికి ఉన్న బలమని చెప్పారు. ‘ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకుని తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు. 2029కి ఏపీని దేశంలో నంబర్‌వన్‌ గా మార్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పని చేశాం. నేడు వైకాపా ప్రభుత్వం తన విధ్వంస విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో... 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు బ్రిటిష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టిన ఘట్టాల్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని, రాష్ట్రాన్ని ఏలుతున్న నియంతల్ని అదే స్ఫూర్తితో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఏపీ యువతపై ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పార్టీ కార్యానిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు