Andhra News: ‘పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదు.. నేను చాలు’

‘రాష్ట్రంలో... ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైకాపా ఆగడాలు పెచ్చుమీరాయి. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి అండదండలతో దౌర్జన్యాలు పెరిగాయి.

Updated : 27 Jan 2023 06:49 IST

పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌

పుంగనూరు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో... ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైకాపా ఆగడాలు పెచ్చుమీరాయి. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి అండదండలతో దౌర్జన్యాలు పెరిగాయి. పుంగనూరులో పెద్దిరెడ్డిపై పోటీ చేస్తా. ఆయన మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో నా గెలుపు ఖాయం’ అని పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వై ప్లస్‌ భద్రత కల్పించాక తొలిసారి గురువారం ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘వైకాపా నాయకుల ప్రోత్సాహం, కొందరు పోలీసుల సహకారంతో నా కార్యక్రమాలను అడ్డుకోవడం, ఇంటిపై దాడి చేయడం వంటి ఘటనలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఇటీవల వివరించా. ఆయన స్పందించి నాకు వై ప్లస్‌ భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు. నన్ను హతమార్చేందుకు వైకాపా నేతలు చేసిన దాడి కేసులో పురోగతి లేదు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. నేను తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలవడం లేదు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది నెల రోజుల్లో తేలుతుంది. పెద్దిరెడ్డిపై పోటీకి నేను చాలు. తెదేపా అధినేత చంద్రబాబు అవసరం లేదు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తా. నాకు మద్దతిచ్చే ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా’ అని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని