ములాయంకు భారతరత్న ఇవ్వాలి

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్‌ యాదవ్‌ దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నకు అర్హులని ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 05:04 IST

సమాజ్‌వాదీ పార్టీ నేతల డిమాండ్‌
పద్మ విభూషణ్‌ పురస్కారం ఆయన స్థాయిని తగ్గించడమేనని వెల్లడి

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్‌ యాదవ్‌ దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నకు అర్హులని ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు ములాయం స్థాయిని, దేశానికి ఆయన చేసిన సేవలను పరిహసించేలా ఉందని విమర్శించారు. నేతాజీ ములాయంను నిజంగా గౌరవించదలిస్తే భారత రత్న బిరుదుతో సత్కరించాలని గురువారం హిందీలో ట్వీట్‌ చేశారు. ‘అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న మినహా మరేదీ దివంగత ములాయం సింగ్‌ స్థాయికి సరితూగదు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆయనకు భారత రత్నను ప్రకటించాల’ని ఎస్పీ అధికార ప్రతినిధి ఐ.పి.సింగ్‌ డిమాండ్‌ చేశారు. ములాయం సింగ్‌ కోడలు, పార్లమెంటు సభ్యురాలు డింపుల్‌ యాదవ్‌ స్పందిస్తూ...‘నేతాజీకి ఇదివరకే అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాల్సింది. ఇప్పటికైనా ఆయనకు ‘భారత రత్న’ ప్రకటించాలన్నది మా డిమాండ్‌’ అని తెలిపారు. ఇదే విషయమై ఎస్పీ నేత శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ స్పందిస్తూ...తన సోదరుడు ములాయం సింగ్‌ పేదలు, కార్మికులు, నిరుద్యోగులు సహా సమాజంలోని ప్రతిఒక్కరి క్షేమం కోసం పాటుపడ్డారని తెలిపారు. ఆయన సేవలకు గాను పద్మ విభూషణ్‌ను ప్రకటించారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు