Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత

తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం.. పార్టీపరంగా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేదికగా నిలుస్తోంది.

Updated : 27 Jan 2023 10:28 IST

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం.. పార్టీపరంగా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేదికగా నిలుస్తోంది. గతంలో పార్టీ పరంగానూ.. తెదేపా పాలనలోనూ రాష్ట్ర స్థాయిలో అమలు చేసిన అనేక కార్యక్రమాలకు చంద్రబాబు కుప్పంలోనే శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పంలో ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు.

అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘వస్తున్నా మీకోసం’ పేరిట పాదయాత్ర చేపట్టిన ఆయన కుప్పంలో ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. కుప్పంలో ర్యాలీ ప్రారంభించి 45 కిలోమీటర్ల మేర బుల్లెట్‌ నడిపి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తెదేపా పటిష్ఠతతోపాటు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని ప్రయోగాలకు నిలయంగా మార్చారు. ‘శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, నీరు- మీరు, నీరు- చెట్టు’ తదితర కార్యక్రమాలను కుప్పంలోనే ప్రారంభించారు. బిందు సేద్యం పథకాన్ని 1999లో ముఖ్యమంత్రిగా ఆయన తొలుత కుప్పంలోనే అమలుచేసి.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు.


లక్ష్మీపురం ఆలయం సెంటిమెంటు

కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో కొలువైన ప్రసన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తెదేపా కార్యక్రమాలను ప్రారంభించడాన్ని సెంటిమెంటుగా కొనసాగిస్తున్నారు. గతంలో అనేక దఫాలు చంద్రబాబు కుప్పం పర్యటనలు, నామినేషన్లు, ర్యాలీలకు సంబంధించి వరదరాజస్వామి సన్నిధిలో పూజల తర్వాతే కార్యక్రమాలను ప్రారంభించడాన్ని ఆనవాయితీగా చేపట్టారు. గతంలో పలుమార్లు కుప్పంలో పర్యటించిన లోకేశ్.. ఎన్నికల ప్రచారాలు, గ్రామ పర్యటనలనూ లక్ష్మీపురంలో పూజలతోనే ప్రారంభించారు. శుక్రవారం యువగళం పాదయాత్రనూ వరదరాజస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం.. లక్ష్మీపురం నుంచి ప్రారంభిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని