పోలీసుల ప్రేక్షక పాత్రపై అసంతృప్తి

రాజకీయ పార్టీలు, ముఖ్య నాయకులు ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహించినా... పాదయాత్రలు, ర్యాలీలు చేపట్టినా బందోబస్తు మొదలు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.

Published : 28 Jan 2023 03:04 IST

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: రాజకీయ పార్టీలు, ముఖ్య నాయకులు ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహించినా... పాదయాత్రలు, ర్యాలీలు చేపట్టినా బందోబస్తు మొదలు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా తొలిరోజు శుక్రవారం కుప్పం పట్టణంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. పాదయాత్రకు అనుమతిచ్చినప్పుడే అవసరమైన పురుష, మహిళా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఉత్తర్వుల్లో సూచించారు. తమ సిబ్బందీ సహకరిస్తారని అందులో తెలిపారు. ఇందుకు తగ్గట్లుగానే 500 మంది పోలీసులను పాదయాత్ర విధులకు కేటాయించినప్పటికీ కొందరు ఈ బాధ్యతలు తమవి కావన్నట్లు వ్యవహరించారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. తొలిరోజు కీలక నేతల భద్రతతోపాటు బందోబస్తును కూడా తెదేపా వాలంటీర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బందే చూసుకున్నారని తెలిపారు. సినీ కథానాయకులు బాలకృష్ణ, తారకరత్న, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ల వెంట వాలంటీర్లు మాత్రమే కనిపించారు. అభిమానులు, కార్యకర్తలు దూసుకొస్తుంటే వారే నిలువరించారు. పోలీసులు మాత్రం రోడ్డు పక్కనే ఉండిపోయారు. తారకరత్న ఆసుపత్రిలో చేరడానికి ఇదీ ఒక కారణమని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. ఒకానొక సందర్భంలో అభిమానుల తాకిడి పెరగడంతో బాలకృష్ణ, శ్రీరామ్‌లను తెదేపా ప్రచారం రథంలోకి పంపించారు. కుప్పంలోని వంతెన నుంచి ప్రాంతీయ ఆసుపత్రి వరకు ట్రాఫిక్‌ నిలిచిపోగా తెదేపా కార్యకర్తలు, యువకులే క్రమబద్ధీకరించారు. వైకాపా నాయకుల ఫ్లెక్సీల వద్ద మాత్రం పోలీసు సిబ్బందిని మోహరించారు. గురువారం రాత్రే తెదేపా నేతలు ఏర్పాటు చేసుకున్న కొన్ని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భావించినప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు సంయమనం పాటించారు. ఫలితంగానే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని