సంక్షిప్త వార్తలు(5)

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకుడు శివప్రకాష్‌జీతో భేటీ అయ్యారు.

Updated : 28 Jan 2023 06:32 IST

రాజ్‌భవన్‌ను భాజపా కార్యాలయంగా మార్చొద్దు
ఎమ్మెల్సీ భానుప్రసాద్‌

ఈనాడు హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ను భాజపా కార్యాలయంగా మార్చొద్దని భారాస ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా గవర్నర్‌ ఉంటారని, ఆ పదవికి మచ్చ తెచ్చేలా కొందరు గవర్నర్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.


నేడు నాందేడ్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌ : మహారాష్ట్రలో భారాస బహిరంగ సభ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం నాందేడ్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి మద్దతుదారులను సభకు ఆహ్వానించనున్నారు. వచ్చే నెల 5న నాందేడ్‌లో నిర్వహించనన్న భారాస బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు.


‘సింగరేణి నిర్వీర్యానికి భాజపా కుటిల యత్నాలు’

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కార్మికుల పక్షాన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం (టీబీజీకేఎస్‌) కొట్లాడుతోందన్నారు. అహర్నిశలు శ్రమించి, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమానికి నిరంతరం సంఘం కృషిచేస్తోందని పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులందరికీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.


‘యువగళం‘ జయప్రదం కావాలి: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర జయప్రదం కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘‘యువత భవిత కోసం, ప్రజల బతుకు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం యువగళం పాదయాత్ర’’ అని శుక్రవారం చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


జోడో యాత్ర తరవాత భావసారూప్య పార్టీలతో భేటీ: నీతీశ్‌

పట్నా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగియగానే, భావసారూప్యత గల పార్టీలతో సమావేశం జరపాలని భావిస్తున్నట్లు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆ సందర్భంగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహం రచిస్తామని చెప్పారు. బిహార్‌లో ఏడు పార్టీల మహాగఠ్‌ బంధన్‌ కూటమిలో జనతాదళ్‌ (యునైటెడ్‌)కు కాంగ్రెస్‌ జూనియర్‌ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం తమ పార్టీ సభ్యత్వం 50 లక్షల నుంచి 75 లక్షలకు పెరిగిందని నితీశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని