ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరం

గవర్నర్‌ని అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Published : 28 Jan 2023 04:30 IST

గవర్నర్‌ను అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లే: ఈటల

ఈనాడు, దిల్లీ: గవర్నర్‌ని అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం విషయంలో సీఎం కేసీఆర్‌ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌పై వాడిన భాషను చూసి యావత్‌ మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోందని చెప్పారు. గణతంత్ర ఉత్సవాలను నిషేధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని.. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రికి విన్నవించనున్నట్లు చెప్పారు. దిల్లీ తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గత గవర్నర్‌కు వందల సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన కేసీఆర్‌ మహిళా గవర్నర్‌ విషయంలో వ్యవహరిస్తున్న తీరును సభ్యసమాజం గమనిస్తోంది. కేసీఆర్‌కు మహిళలంటే చులకన భావం ఉన్నందునే తన పాలన తొలి అయిదేళ్లలో ఒక్క మహిళా మంత్రినీ నియమించలేదు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందంటున్న కేసీఆర్‌.. పాఠశాలలు, వైద్యశాలల పరిశీలనకు నిన్న, మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్‌ పాలనలోని దిల్లీకి వెళ్లడం సిగ్గుపడే అంశం. రెండు పడక గదుల ఇళ్లు రాకపోవడం, పచ్చని పొలాలు మాస్టర్‌ప్లాన్లలో పోతుండడం తదితర కారణాలతో రాష్ట్రంలో రైతులు, ఇతరులు ఆత్మహత్యలు చేసుకోవడం నిజం కాదా? తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారు.. ఏ గ్రామంలోనైనా అలా ఇస్తున్నట్లు చూపితే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా.

ఇతర పార్టీల నేతల సానుభూతి అక్కర్లేదు..

బీఎస్పీ, సీపీఐ, తెదేపా ఎమ్మెల్యేలను శాసనసభలో లేకుండా చేసిన కేసీఆర్‌, చివరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ప్రజలను కాకుండా ఇంటెలిజెన్స్‌ను, కుట్రలను, డబ్బు మూటలను కేసీఆర్‌ నమ్ముకున్నారు. 2023 డిసెంబరు ఏడు తర్వాత ఆయన పాలనలో ఉండరు. కేసీఆర్‌ వెళ్లగొడితే ఇంకో పార్టీలోకి వెళ్లానే తప్ప పూటకో వేషం.. సంవత్సరానికో జెండా కప్పుకొనే వాడిని కాదు. నాకు ఇతర పార్టీ నాయకుల సానుభూతి అక్కర్లేదు. ప్రజల సానుభూతి ఉంది’’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా నేత తుర్క నరసింహులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు