పోలీసులు లేరు.. అందుకే ఆపేశా

భద్రతా కారణాలతో జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న భారత జోడో యాత్ర నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం తప్పుకొన్నారు.

Published : 28 Jan 2023 04:30 IST

జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర తాత్కాలిక నిలిపివేత: రాహుల్‌
భద్రతా లోపాలపై   కాంగ్రెస్‌ ఆగ్రహం
భారీగా జనం వస్తారని   చెప్పలేదు: పోలీసులు

కాజీగుండ్‌: భద్రతా కారణాలతో జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న భారత జోడో యాత్ర నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం తప్పుకొన్నారు. తనకు సరైన రక్షణ కల్పించ[కపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. జనాన్ని నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదని, దీంతో తన భద్రతా సిబ్బంది సూచన మేరకు యాత్ర నుంచి వైదొలిగానని తెలిపారు. శనివారం నుంచి తన యాత్ర యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం జమ్ము ప్రాంతంలోని బనిహాల్‌ నుంచి జవహార్‌లాల్‌ సొరంగం గుండా..కాజీగుండ్‌లోకి ప్రవేశించిన రాహుల్‌.. 500 మీటర్లు నడిచిన తర్వాత యాత్రనుంచి విరమించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ‘‘జనాన్ని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు’’ అని రాహుల్‌ ఆరోపించారు. తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత జమ్మూకశ్మీర్‌ పోలీసులదేనని అన్నారు. భారత్‌ జోడో యాత్రకు భద్రత కల్పించకపోవడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజకీయాలు చేయొచ్చు. కానీ రాహుల్‌ భద్రతతో ఆటలు సమంజసం కాదు. ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోంది’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌.. కేంద్రంపై మండిపడ్డారు. ఇప్పటికే దేశం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను కోల్పోయిందని, ఇలాంటి విషయాల్లో అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అన్నారు. రాహుల్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. ఈ ఆరోపణలను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఖండించారు. భారీగా జనం హాజరుకానున్నారన్న విషయాన్ని నిర్వాహకులు తమకు తెలియచేయలేదని తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే యాత్రను నిలిపివేశారని చెప్పారు. అంతకుముందు రాహుల్‌యాత్రలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. దేశంలోని మైనారిటీలను లక్ష్యం చేసుకుంటూ సాగుతున్న దాడుల నేపథ్యంలోనే రాహుల్‌ ఈ యాత్ర ప్రారంభించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని