సంక్షిప్త వార్తలు (7)

అదానీ కంపెనీ షేర్లు.. అందులో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థల షేర్లు రూ.నాలుగు లక్షల కోట్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Updated : 29 Jan 2023 05:21 IST

షేర్ల పతనంపై అదానీని విచారించాలి: కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ కంపెనీ షేర్లు.. అందులో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థల షేర్లు రూ.నాలుగు లక్షల కోట్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అదానీ కంపెనీల షేర్ల పతనంపై సెబీ, ఈడీ సంస్థలతో విచారణ జరిపించి అదానీని అరెస్టు చేయించాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


‘అదానీ’ సంక్షోభంపై విచారణ జరిపించాలి
మల్లు రవి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: అదానీ కంపెనీలో సంక్షోభానికి కారణాలపై ఆర్‌బీఐ, సెబీతో విచారణ జరిపించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి కోరారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అదానీ కంపెనీ షేర్లు ఎందుకు కుప్పకూలాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రధాని అయ్యాక ఆయనకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించారని, ఇతర దేశాల్లోనూ కాంట్రాక్టులు ఇప్పించడంలో మోదీ సహకరించారని ఆరోపించారు. ‘‘అదానీ కంపెనీ నష్టం ఆయనొక్కడిదే కాదు.. దేశానికి ఇది తీరని నష్టం. ఇంత జరుగుతున్నా మోదీ ప్రేక్షకపాత్ర వహించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి’’అని మల్లు రవి డిమాండ్‌ చేశారు.


గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని పీసీసీ ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌, కన్వీనర్‌ నరేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీలను కేసీఆర్‌ ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎనిమిదేళ్లలో 1700మంది తెలంగాణ వలస కూలీలు గల్ఫ్‌దేశాల్లో పలు కారణాలతో మృతి చెందారని, ఇందుకు శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసుస్టేషన్‌లోని శవపేటికల రిజిష్టరే సాక్ష్యం అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్‌ నుంచి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలని కోరారు.


త్రిపుర ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా
మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసే బరిలోకి

దిల్లీ, అగర్తల: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఎన్నికల సందడి మొదలైంది. 54 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను భాజపా శనివారం దిల్లీలో విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాకు టౌన్‌ బోర్డోవలీ, కేంద్ర సహాయమంత్రి ప్రతిమా భౌమిక్‌కు ధన్‌పుర్‌ స్థానాలను కేటాయించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో భాజపా 55, తమ మిత్రపక్షం ‘త్రిపుర మూలవాసుల కూటమి (ఐపీఎఫ్‌టీ)’ ఐదు స్థానాలలో పోటీ చేస్తాయని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా అగర్తలాలో ప్రకటించారు. కొత్తగా ‘టిప్రా మోథా’ అనే ప్రాంతీయ పార్టీ రావడంతో ఐపీఎఫ్‌టీ బలం కాస్త తగ్గింది. దీంతో గతంలో ఆ పార్టీకి కేటాయించిన కొన్ని సీట్లకు భాజపా కోత పెట్టింది. టిప్రా మోథాతో కలిసి వెళ్లడానికి భాజపా తొలుత సిద్ధపడినా.. మూలవాసులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండుపై ఆ పార్టీ గట్టిగా నిలబడడంతో పొత్తు సంప్రదింపుల నుంచి భాజపా తప్పుకొంది.


తారకరత్న అస్వస్థతపై వైకాపా నేతలది నీచరాజకీయం
తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతపైనా వైకాపా నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ధ్వజమెత్తారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వారికి, సొంత బాబాయిని దారుణంగా చంపినవారికి శవ రాజకీయాలు కొత్త కాదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు పదే పదే లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై విషం చిమ్ముతున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘జగన్‌రెడ్డిది డబుల్‌ ఐరన్‌లెగ్‌. తన పాదయాత్రలో వైకాపా కార్యకర్తల్ని బలితీసుకున్న జగన్‌రెడ్డి.. సీఎం అయ్యాక చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. జగన్‌రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యం తాగి ఈ మూడున్నరేళ్లలో వందల మంది చనిపోయారు. అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటన్నింటికీ జగన్‌రెడ్డి కారణం కాదా? మంత్రి రోజాకు రాజకీయాల్లో బూతులు మాట్లాడటం తప్ప ఇంకేం తెలుసు? పర్యాటక శాఖను గాలికొదిలిన రోజా సొంత పర్యటనల్లో మునిగితేలుతున్నారు’ అని సత్యనారాయణరాజు ధ్వజమెత్తారు.


యువగళానికి తెదేపా ఎన్నారై నాయకుల సంఘీభావం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయవంతమవ్వాలని బహ్రెయిన్‌, కువైట్‌లోని తెదేపా ఎన్నారై విభాగం నాయకులు ఆకాంక్షించారు. బహ్రెయిన్‌లోని హిందూ దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి.. సంఘీభావ యాత్ర చేపట్టారు. తెదేపాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని నినాదాలు చేశారు. కువైట్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?
తెదేపా నేత యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కుప్పం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘అచ్చెన్నాయుడు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయలేదు. వైకాపా అరాచకాలనే ప్రశ్నించారు. అంత పెద్ద సభ జరుగుతుంటే పటిష్ఠ భద్రత కల్పించాల్సిన పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. దీన్ని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నించడం నేరమా? ఇలాంటి అక్రమ కేసులకు భయపడం’ అని రామకృష్ణుడు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని