ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల దుస్థితికి బాధ్యులెవరు?

‘‘అదానీ గ్రూపు స్టాక్స్‌లో ఎల్‌ఐసీ రూ.77 వేల కోట్లు, ఎస్‌బీఐ రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాయి? ఆయా సంస్థలను అదానీగ్రూపుల్లోకి నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యలెవరు?’’ అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో కేంద్రంపై ప్రశ్నలు సంధించారు.

Updated : 29 Jan 2023 09:11 IST

ఆ రెండు సంస్థలను అదానీ గ్రూపులోకి నెట్టిందెవరు?
కేటీఆర్‌ సూటి ప్రశ్న
కేంద్రానికి ఇదే ఆఖరి అవకాశం
ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు మేలు చేయాలి
కేంద్రంలోని భాజపా ముందస్తుకు వెళ్తే తామూ సిద్ధమేనని వ్యాఖ్య

ఈనాడు, నిజామాబాద్‌, హైదరాబాద్‌: ‘‘అదానీ గ్రూపు స్టాక్స్‌లో ఎల్‌ఐసీ రూ.77 వేల కోట్లు, ఎస్‌బీఐ రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాయి? ఆయా సంస్థలను అదానీగ్రూపుల్లోకి నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యలెవరు?’’ అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వైపు నిజామాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నది అసమర్థ, దివాలాకోరు ప్రభుత్వమని ఆరోపించారు. విభజన హామీల అమలు సహా.. తెలంగాణలో ఒక్క సంస్థ ఏర్పాటుకూ సహకరించలేదని పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించిన ఆయన రూ.50 కోట్లతో నిర్మించనున్న కళాభారతి ఆడిటోరియం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.22 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని ప్రారంభించారు. కాకతీయ సాండ్‌ బాక్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. భారాస జిల్లా కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరులతో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘మోదీ విధానాలతో దేశం 30 ఏళ్ల కిందటి ద్రవ్యోల్బణం, 40 ఏళ్ల నాటి నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటోంది. మాట్లాడితే.. జాతీయ రహదారులు నిర్మించామంటారు. అవి టోల్‌ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బే అనే విషయాన్ని గుర్తించాలి. మోదీ సర్కారు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేది చివరి బడ్జెట్‌. ఆ తర్వాత రోజుల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఉంటుంది. అందుకే రాష్ట్రానికి మేలు చేయాలంటే ఇప్పుడే కేటాయింపులు ఉండేలా చూడాలి.

కార్పొరేట్లకు దోచిపెట్టింది నిజం కాదా..

2014 వరకు దేశంలో 14 మంది ప్రధానులు కలిపి రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మోదీ ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు దాటించారు. కార్పొరేట్ల అప్పులు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయటానికి ఈ సొమ్మును వినియోగించింది నిజం కాదా. దేశమంతటా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తే రూ.1.40 లక్షల కోట్లు అవుతుందని కేసీఆర్‌ చెబితే కేంద్రం పట్టించుకోలేదు. బడాబాబులకు రాయితీలు ఇవ్వటానికైతే మనసొచ్చింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ఎంపీలు తెల్లారితే.. నాపై ఇష్టానుసారం మాట్లాడటం తప్ప.. సాధించిందేమీ లేదు. చేతనైతే రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకురావాలి. మోదీని దేవుడని భజన చేయటం కాదు.. ఆయన ఎవరికి మేలు చేశారో చెప్పాలి. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచినందుకా? చేనేతపై పన్ను వేసినందుకా? రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసినందుకు దేవుడయ్యాడా. కేంద్ర సంస్థలు ప్రకటించిన అవార్డులే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం’’ అని అన్నారు.

ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కళాభారతి ఆడిటోరియం శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘నిజామాబాద్‌ పార్లమెంట్‌ సహా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో భారాస విజయం సాధించేలా కార్యకర్తలు సిద్ధం కావాలి’’అని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ముందస్తుకు వెళ్తే తామూ ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పారు.

త్వరలో 16 ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు

కాకతీయ సాండ్‌ బాక్స్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిదు జిల్లాల నుంచి వచ్చిన రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘‘ తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చాం. 2600 రైతువేదికలు నిర్మించాం. రైతుబంధు కింద రూ.65 వేల కోట్లు జమ చేశాం. 46 వేల చెరువులను మిషన్‌ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేశాం. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఆరు మీటర్ల మేర నీరు పైకి ఉబికొచ్చింది. ఈ అంశాన్ని లాల్‌బహదూర్‌శాస్త్రి వర్సిటీలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో 2014 వరకు 26వ స్థానంలో ఉన్న తెలంగాణ, ప్రస్తుతం 3వ స్థానానికి చేరింది. ‘ఈనాడు’లో ప్రచురితమైన ఈ విషయాన్ని రైతులందరూ చదవాలి. త్వరలో రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాం’’ అని కేటీఆర్‌ అన్నారు.


అభివృద్ధికి ప్రాధాన్యం లభించకనే వెనుకబాటు

కాకతీయ సాండ్‌బాక్స్‌ సంస్థ.. ‘డెవలప్‌మెంట్‌ డైలాగ్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో దేశ, విదేశాల నుంచి హాజరైన ప్రతినిధులనుద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘జనాభాలో చైనాతో పోటీపడిన మనం, అభివృద్ధిలో వెనుకబాటుకు రాజకీయాలే కారణం. మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 100 ఎంబీపీఎస్‌ బ్రాడ్‌ బాండ్‌ ఫైబర్‌ కనెక్షన్ల విషయంలోనూ మొదటి స్థానంలో ఉన్నాం. కరోనా తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకొని అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాలతో ఇది సాధ్యమైంది’’ అన్నారు. ప్రతినిధులు అడిగిన సందేహాలను కేటీఆర్‌ నివృత్తి చేశారు. కర్ణాటకలోని దేశ్‌పాండే ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గురురాజ్‌ దేశ్‌పాండే, కాకతీయ సాండ్‌ బాక్స్‌ వ్యవస్థాపకులు రాజురెడ్డి, సామ ఫణీంద్రరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని