భారాసకు ‘మున్సిపల్‌’ తలనొప్పి

భారాసకు అవిశ్వాసాల తలనొప్పి ప్రారంభమైంది. రాష్ట్రంలోని కొన్ని పురపాలికల్లో అసమ్మతి స్వరం పెరిగింది. పురపాలక చట్టం ప్రకారం పాలకవర్గం కొలువుదీరిన మూడేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టొచ్చు.

Published : 29 Jan 2023 03:12 IST

కొన్ని పురపాలికల్లో అసంతృప్తులు
జవహర్‌నగర్‌ మేయర్‌, నలుగురు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లపై అవిశ్వాసాలు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే బృందం: భారాసకు అవిశ్వాసాల తలనొప్పి ప్రారంభమైంది. రాష్ట్రంలోని కొన్ని పురపాలికల్లో అసమ్మతి స్వరం పెరిగింది. పురపాలక చట్టం ప్రకారం పాలకవర్గం కొలువుదీరిన మూడేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టొచ్చు. దీని గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో మేయర్‌, ఛైర్‌పర్సన్‌లపై అసంతృప్తి ఉన్నవారు తాజాగా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. దీంతో ఆయా చోట్ల రాజకీయం ఆసక్తికరంగా మారింది. జవహర్‌నగర్‌ మేయర్‌తో పాటు పలు మున్సిపాలిటీల్లో భారాస మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లకు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే అసమ్మతి సెగ తగిలింది.

రహస్య ప్రాంతానికి జవహర్‌నగర్‌ కార్పొరేటర్లు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్‌ మేకల కావ్య సహా 28 మంది కార్పొరేటర్లున్నారు. మేయర్‌ తీరుపై డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ నేతృత్వంలో 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి  చెప్పిన పనులనే చేస్తున్నారని, సొంత డివిజన్‌లో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరు బస్సులో శిబిరానికి తరలివెళ్లినట్లు సమాచారం. శనివారం న్యాయవాది ద్వారా అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించేందుకు మంత్రి యత్నించినా వారు ససేమిరా అన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోవడం లేదంటూ పెద్దఅంబర్‌పేట్‌లో అసమ్మతి

పెద్దఅంబర్‌పేట్‌ ఛైర్‌పర్సన్‌ చెవుల స్వప్న చిరంజీవి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ చామ సంపూర్ణ విజయశేఖర్‌రెడ్డిలపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. వీరిలో కాంగ్రెస్‌, భారాస, భాజపా, సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు. పురపాలికలో కీలకమైన అభివృద్ధి పనులు సాగకుండా ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌లు అడ్డుకుంటున్నారని.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సూచనలనూ ఛైర్‌పర్సన్‌ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

ఇబ్రహీంపట్నంలో అవినీతి ఆరోపణలు

ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతిపై అధికార భారాస, కాంగ్రెస్‌, భాజపాలకు చెందిన 21 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఛైర్‌పర్సన్‌ స్రవంతిపై అవినీతి ఆరోపణలున్నాయని, పురపాలక సంఘం వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారని వైస్‌ఛైర్మన్‌ ఆకుల యాదగిరి, భారాస కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

ఒప్పంద గడువు దాటిందంటూ తాండూరులో..

వికారాబాద్‌ జిల్లా తాండూరు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ స్వప్నపై అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌ పట్లోళ్ల దీప, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి మొత్తం 24 మంది కలెక్టర్‌ నిఖిలకు శనివారం అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ మున్సిపాలిటీలో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్వప్న, దీపలు రెండున్నరేళ్ల చొప్పున పదవిలో కొనసాగాలి. ఈ గడువు గత ఏడాది జులై 27తో ముగిసింది. అయినా పదవి నుంచి వైదొలగడానికి స్వప్న ససేమిరా అన్నారు. దీంతో అధ్యక్షురాలు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గం, ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వర్గంగా విడిపోయారు. అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.

వికారాబాద్‌లోనూ 20 మంది సంతకాలతో..

వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ ఛైర్‌పర్సన్‌ షంషాద్‌ బేగంలపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రతిని భారాస కౌన్సిలర్లు కలెక్టర్‌ నిఖిలకు శనివారం అందజేశారు. మాజీ ఛైర్‌పర్సన్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ లంక పుష్పలతారెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 మంది వార్డు కౌన్సిలర్ల సంతకాలతో దీన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని