ఎమ్మెల్సీ కవితతో ఏఐఎస్‌ఎంకే అధ్యక్షుడు శరత్‌కుమార్‌ భేటీ

ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి(ఏఐఎస్‌ఎంకే) అధ్యక్షుడు, సినీనటుడు శరత్‌కుమార్‌ శనివారం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.

Published : 29 Jan 2023 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి(ఏఐఎస్‌ఎంకే) అధ్యక్షుడు, సినీనటుడు శరత్‌కుమార్‌ శనివారం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌ రాష్ట్రసమితిలో తమ పార్టీ విలీనంపై చర్చించారని తెలిసింది. ఇప్పటికే తమిళనాడులోని వీసీకే పార్టీ భారాసలో విలీనానికి ముందుకొచ్చింది. తాజాగా శరత్‌కుమార్‌ విలీనంపై చర్చించారని సమాచారం. భారాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన రాగా.. బడ్జెట్‌ రూపకల్పన సమావేశాల్లో ఉన్న సీఎం... కవితతో భేటీ కావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా భారాస, దేశ రాజకీయాలపై చర్చించారు. భారాస స్థాపన, పార్టీ ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా తదితరాలను శరత్‌కుమార్‌కు కవిత వివరించారు. అనంతరం ఆయన్ను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదొడుకులపై కవిత ఆందోళన

అదానీ గ్రూపుపై ఇటీవల అంతర్జాతీయ నివేదిక వచ్చిన తర్వాత ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, స్టాక్‌మార్కెట్‌లో ఒడిదొడుకులు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై ప్రతీ భారతీయునిలో నెలకొన్న అనుమానాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత శనివారం ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రితో పాటు సెబీ చీఫ్‌  మాధభీ పురీ బుచ్‌ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని