ఎస్సీలపై దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ఎస్సీలపై దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

Updated : 29 Jan 2023 04:42 IST

భాజపా ఎస్సీ మోర్చా కార్యవర్గ తీర్మానం

ఈనాడు, అమరావతి: ఎస్సీలపై దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను పట్టించుకోవడం లేదని, రద్దుచేసిన ఎస్సీ కార్పొరేషన్‌ పథకాలను పునరుద్ధరించాలన్న డిమాండుతో ఫిబ్రవరి 13న అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 25వేల పంచాయతీల్లో మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ‘దళిత ప్రగతి బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు, ఏప్రిల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు. పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్లను ఉపయోగించుకుంటూ ఆ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్‌ టుండియా, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.దేవానంద్‌ మాట్లాడుతూ.. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లిస్తే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


కావలిలో పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

కావలి, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో భాజపా నాయకుల పాదయాత్రను పోలీసులు నిలువరించారు. దళితులపై దాడులను నిరసిస్తూ శనివారం ముసునూరు అంబేడ్కర్‌ బొమ్మ నుంచి దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల వరకు పాదయాత్ర చేసేందుకు నాయకులు సిద్ధమయ్యారు. వైకాపా నేతల వేధింపులవల్ల ఆత్మహత్య చేసుకున్న ముసునూరు ఎస్సీ కాలనీలోని దుగ్గిరాల కరుణాకర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పోలీసులు వచ్చి పాదయాత్రకు అనుమతి లేదంటూ భాజపా జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌ కుమార్‌ యాదవ్‌, కావలి పట్టణ పార్టీ అధ్యక్షుడు కె.బ్రహ్మానందం, మహిళా నాయకురాలు పద్మావతి శ్రీదేవిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ వైకాపా దౌర్జన్యాలపై తమ పోరాటాలు కొనసాగుతాయని నాయకులు పేర్కొన్నారు.  నేతల అరెస్టుపై భాజపా నేతలు కావలి ఆర్డీవో శీనానాయక్‌కు విన్నపమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు