ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు: సీపీఎం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు మోదీ దయాదాక్షిణ్యాలు కావని, అవి రాష్ట్ర ప్రజల హక్కని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు స్పష్టం చేశారు.

Published : 29 Jan 2023 03:36 IST

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు మోదీ దయాదాక్షిణ్యాలు కావని, అవి రాష్ట్ర ప్రజల హక్కని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన సమరయాత్ర శనివారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాబూరావు మాట్లాడుతూ... ‘రాష్ట్రానికి హోదా ఇస్తానని మోదీ నమ్మక ద్రోహం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడంతోపాటు అదనపు నిధులను కేటాయించాలి’ అని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ... విభజన హామీలను విస్మరించి భాజపా మోసగించిందని, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు హోదా పోరాటంలో తమతో కలిసి రావాలన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, డిగ్రీలు చేసి ఏటా 3లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని