వైకాపా వర్గాల బాహాబాహీ

వైకాపా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కృష్ణా జిల్లా పరిధిలోని నాగాయలంక మండలం ఇందుకు వేదికైంది.

Published : 29 Jan 2023 03:36 IST

ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేష్‌బాబు  అనుచరుల మధ్య విభేదాలు
మీడియాపైనా దాడి

నాగాయలంక, అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కృష్ణా జిల్లా పరిధిలోని నాగాయలంక మండలం ఇందుకు వేదికైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు వర్గాల మధ్య విభేదాలు కొట్లాటకు దారితీశాయి. ఘర్షణను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడి ఓ కెమెరాను ధ్వంసం చేశారు. ఈ తంతు పోలీసు అధికారుల సమక్షంలోనే జరిగినా వారు ప్రేక్షక పాత్ర వహించారు. నాబార్డు ఛైర్మన్‌ కె.వి.షాజీ ఆధ్వర్యంలో నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో శనివారం మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య ఏర్పడిన చిన్న వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు చెప్పులతో దాడిచేశారు. అధికారిక కార్యక్రమంలో తమను తీవ్రంగా అవమానించారంటూ వారూ చెప్పులతో ఎదురుదాడికి దిగారు. ఒక దశలో ఎమ్మెల్యే రమేష్‌బాబుపై ఎంపీ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రతి దాడి చేశారు. ఈ సంఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి దిగి ఒక కెమెరాను ధ్వంసం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు