నెహ్రూను సమర్థించడమే కాంగ్రెస్‌ పని

నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను కప్పి పుచ్చుతూ, దేశాభివృద్ధిని విస్మరించడమే కాంగ్రెస్‌ పనిగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Updated : 29 Jan 2023 05:16 IST

కర్ణాటక పర్యటనలో అమిత్‌ షా ఆరోపణ

ఈనాడు, బెంగళూరు: నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను కప్పి పుచ్చుతూ, దేశాభివృద్ధిని విస్మరించడమే కాంగ్రెస్‌ పనిగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కర్ణాటక పర్యటనలో భాగంగా ఆయన శనివారం ధార్వాడ, బెళగావిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘గాంధీ కుటుంబానికి హారతి పట్టేందుకే కాంగ్రెస్‌ పరిమితమైంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ ఏటీఎంలుగా మార్చుకుంది. ఆయా రాష్ట్రాలను పీకల్లోతు అవినీతిలో కూరుకునేలా చేస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ప్రపంచానికి కొత్త భారతదేశాన్ని పరిచయం చేశాయి. ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కశ్మీరును అఖండ భారతంలో విలీనం చేయడం, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్‌ను ఐదో స్థానంలో నిలపటం మోదీవల్లే సాధ్యమైంది. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌లను ఎనిమిదేళ్లలో గణనీయంగా పెంచారు. దేశంలోని 70వేల అంకురాల్లో 45% ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే స్థాపించారు. వీటిల్లో 30% అంకురాలకు యువతులే సీఈవోలుగా ఉన్నారు’ అని గుర్తు చేశారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్‌ షా ధార్వాడ జిల్లా కుందగోళ నుంచి బెళగావి వరకు 2కిలోమీటర్ల రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ సీఎం యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు