భాజపా ప్రచార ఖర్చు రూ.313 కోట్లు

దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటనలు, ప్రచారాల కోసం చేస్తున్న ఖర్చులపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం.. రూ.313.17 కోట్ల ఖర్చుతో భాజపా అగ్రస్థానంలో ఉంది.

Updated : 29 Jan 2023 04:54 IST

రూ.280 కోట్లతో ద్వితీయస్థానంలో కాంగ్రెస్‌
2021-22 వార్షిక నివేదికలో ఈసీ వెల్లడి

దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటనలు, ప్రచారాల కోసం చేస్తున్న ఖర్చులపై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం.. రూ.313.17 కోట్ల ఖర్చుతో భాజపా అగ్రస్థానంలో ఉంది. రూ.279.73 కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయస్థానంలో నిలిచింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి పంపిన వార్షిక వివరాలు, పార్టీల ఆడిట్‌ నివేదికల ఆధారంగా ఈ లెక్కలు విడుదల చేశారు. భాజపా ఖర్చులో 75 శాతం ఎన్నికలు, సాధారణ ప్రచారానికి వెచ్చించారు. ప్రకటనల కోసం రూ.164 కోట్లు.. ఆడియో, వీడియోలకు రూ.18.41 కోట్లు.. ఎలక్ట్రానిక్‌ మీడియాకు రూ.72.28 కోట్లు ఖర్చు చేశారు. కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్ల కోసం మరో రూ.36.33 కోట్లు.. కరపత్రాల ప్రకటనల కోసం రూ.22.12 కోట్లు వెచ్చించినట్లు నివేదిక తెలిపింది. పార్టీ మెుత్తం ఖర్చులో 37 శాతం ప్రకటనలు, ప్రచారం కోసం భాజపా వెచ్చించింది.

* మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ రూ.268.33 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈసీ నివేదిక వెల్లడించింది. ఈ మెుత్తం ఆ పార్టీ ఖర్చులో 11 శాతం మాత్రమేనని తెలిపింది. మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ రూ.85.17 కోట్లు ఖర్చు చేసింది. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రూ.35.40 కోట్లు ప్రకటనలు, ప్రచారం కోసం ఖర్చు చేసింది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 97 శాతం. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటనల కోసం రూ.30.29 కోట్లు వెచ్చించింది. ఈ మెుత్తం పార్టీ ఖర్చులో 46 శాతానికి సమానం.

*  తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే ప్రచారం, ప్రకటనల కోసం రూ.28.43 కోట్లు ఖర్చు చేసిందని ఈసీఐ నివేదిక పేర్కొంది. ఇది ఆ పార్టీ మెుత్తం ఖర్చులో 78 శాతమని తెలిపింది. నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌ రూ.28.63 కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రూ.25.57 కోట్లు వెచ్చించినట్లు ఈసీ వెల్లడించింది. అఖిలేశ్‌ యాదవ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ రూ.7.56 కోట్లు.. తెలంగాణలో అధికారంలో ఉన్న భారాస రూ.7.12 కోట్లు.. నీతీశ్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న జనతాదళ్‌ యునైటెడ్‌ రూ.4.15 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అధ్యక్షుడిగా ఉన్న  ఆర్‌జేడీ కేవలం రూ.33 వేలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. సీపీఎం  రూ.83.41 కోట్లు ఖర్చు చేసింది. ఆయా పార్టీలు ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికల ప్రకారం.. ఎన్‌సీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐలు ప్రకటనల కోసం ఎటువంటి మొత్తాన్ని ఖర్చు చేయలేదు. ఈసీఐకి ఖర్చుల వివరాలు సమర్పించని పార్టీల జాబితాలో కాంగ్రెస్‌, సీపీఎం ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని