Nara Lokesh: మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు

మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ అమలు చేయలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 30 Jan 2023 05:13 IST

ప్రభుత్వంపై లోకేశ్‌ మండిపాటు
పాడి రైతులను ఆదుకుంటామని హామీ 

ఈనాడు- తిరుపతి, ఈనాడు డిజిటల్‌- చిత్తూరు: మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ అమలు చేయలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకూ అన్నీ ఆయన అనుచరులే చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబోయే 20ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు. 2024లో ఏ ముఖం పెట్టుకుని తెలుగింటి ఆడపడుచులను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గంలో మహిళలు, పాడి రైతులు, అన్నదాతలతో ఆయన సమావేశమయ్యారు. శాంతిపురం ఆదివారం సంతలో తిరిగి చిరు వ్యాపారులతో మాట్లాడారు. మూడో రోజు ఆయన 11 కి.మీ. నడిచారు. ‘తెలుగింటి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగనే. ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామని ఆయన సతీమణి భారతీరెడ్డి చెప్పారు. ఇప్పుడు రావట్లేదు. 45 ఏళ్లున్న మహిళలకు పింఛను లేదు. అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలను మూడు సార్లు పెంచారు. భారీగా పన్నులు వేయడంతో పక్క రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వాటిపై పన్నులు తగ్గిస్తే నిత్యావసరాల ధరలూ తగ్గుతాయి. దీనిపై సమీక్షించి నిత్యావసరాల ధరలను తగ్గించే బాధ్యతను తెదేపా తీసుకుంటుంది’ అని చెప్పారు.

అమూల్‌కు దోచిపెడుతున్నారు

‘జగన్‌ సీఎం అయిన తర్వాత రూ.650 కోట్ల ఆస్తులున్న చిత్తూరు డెయిరీని అమూల్‌ డెయిరీకి రూ.కోటికి అప్పగించారు. చిత్తూరు, ఒంగోలు డెయిరీలు మూతపడ్డాయి. రైతుల పేరిట రూ.3వేల కోట్లు అప్పు చేసి అమూల్‌కు అప్పగిస్తున్నారు. అదే డబ్బు రైతులకు ఇస్తే ఎలా ఉండేదో ఆలోచించాలి. పాడి పరిశ్రమలో యువత భాగస్వామ్యాన్ని పెంచే అంశాన్ని యూత్‌ మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. పాడి రైతులను ప్రోత్సహించి మెరుగైన పథకాలను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. ‘మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాడు వేస్తే తిరగబడండి. మీటర్లు పగలగొట్టండి’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినందుకు వైకాపా కార్యకర్తలు 30 మంది వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టారని, పింఛను తొలగించారని విజయలక్ష్మి అనే మహిళా కార్యకర్త కన్నీటిపర్యంతమయ్యారు. అయినా చంద్రబాబు కోసం పోరాటం చేస్తాననడంతో లోకేశ్‌ ఆమెను ఓదార్చారు. కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుంటే పెద్దిరెడ్డి వద్దకు తీసుకెళతామని బెదిరించినా వెనక్కి తగ్గకపోవడంతో తనకు ఇంటి పట్టా ఇవ్వలేదని ఓ మహిళ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక ఇల్లు కట్టుకుని ఆయనతోనే గృహ ప్రవేశం చేయించుకుంటానని ఆమె తెలిపారు.

హారతులు పట్టిన మహిళలు

‘యువగళం’ పాదయాత్ర ఆదివారంతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముగిసింది. సోమవారం నుంచి పలమనేరు నియోజకవర్గంలో మొదలు కానుంది. ఆదివారం ఉదయం శాంతిపురం మండలం పెద్దబొమ్మనపల్లె నుంచి నుంచి రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె వరకు సాగిన పాదయాత్రకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. పలమనేరు- క్రిష్ణగిరి జాతీయ రహదారికి దూరంగా ఉన్న గ్రామాల్లోని మహిళలు ఆటోలు, ట్రాక్టర్లలో రోడ్డుపైకి చిన్నారులతో వచ్చి లోకేశ్‌కు హారతులు పట్టారు.


‘యువగళానికి’ కర్ణాటక పోలీసుల భారీ బందోబస్తు

ర్ణాటక సరిహద్దులో ఉన్న గుండిశెట్టిపల్లె నుంచి రాజుపేట వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర లోకేశ్‌ పాదయాత్ర సాగింది. యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించగానే ఆ రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. బేతమంగళం సీఐ సునీల్‌ రాజు ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు రోప్‌ పార్టీ ఏర్పాటు చేసి లోకేశ్‌కు రక్షణ వలయంగా నిలిచారు. ఓ డీఎస్పీ అక్కడే ఉండి ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించి పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూశారు. దీంతో లోకేశ్‌ కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పలమనేరు, కృష్ణగిరి జాతీయ రహదారిపై ఆయన మైక్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం జీవో 1ను తీసుకువచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని.. ఆఖరికి మైక్‌ వినియోగించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు