134 రోజులు.. 4,084 కిలోమీటర్లు.. ముగిసిన రాహుల్ జోడోయాత్ర
దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా కొనసాగించిన పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు.
నేడు శ్రీనగర్‌లో బహిరంగ సభ
హాజరుకానున్న విపక్షాల నేతలు
లాల్‌చౌక్‌లో మువ్వన్నెల జెండా ఎగరేసిన కాంగ్రెస్ అగ్రనేత
శ్రీనగర్: దాదాపు 4 వేల కిలోమీటర్లకు పైగా కొనసాగించిన పాదయాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఆదివారం నాడిక్కడి చారిత్రక లాల్‌చౌక్‌లో భారీ భద్రత మధ్య త్రివర్ణ పతాకాన్ని రాహుల్ ఎగురవేశారు. అయితే సోమవారం ఇక్కడి షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభతో యాత్రకు అధికారికంగా ముగింపు పలుకుతారు. వివిధ ప్రతిపక్షాల నేతలు ఈ సభకు హాజరవుతారు. మువ్వన్నెల జెండా ఎగరేసిన తర్వాత రాహుల్ విలేకరులతో మాట్లాడారు. భాజపా, ఆరెస్సెస్ కారణంగా విద్వేషాలు వ్యాపించిన దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా తాము ప్రేమ దుకాణాలు తెరిచామని చెప్పారు. ఈ యాత్రతో దేశానికి ఒక ప్రత్యామ్నాయ దృక్కోణం అందించామని అన్నారు. ‘‘ఈ యాత్రలో లక్షలాది ప్రజలను కలిశాను. వారితో మాట్లాడాను. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఈ యాత్ర కొనసాగింది. మాకు అద్భుతమైన ప్రేమతో కూడిన స్పందన లభించింది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాజపా, ఆరెస్సెస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో, ఇతర వేదికలపై విపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాలను అక్రమ మార్గాల్లో నేలకూలుస్తున్నారని ఆరోపించారు. ‘‘మధ్యప్రదేశ్‌లో మేం గెలిచాం, కానీ భాజపా మాయ చేసి అధికారం చేజిక్కించుకుంది’’ అని ఆక్షేపించారు. చైనా విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. ‘‘అంగుళం భూభాగం కూడా చైనా ఆక్రమించలేదన్న భ్రమలో మన దేశ ప్రధాని ఉన్నారు. నేను ఇటీవల మాజీ సైనికాధికారులను కలిశాను. లద్దాఖ్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం 2 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా కబ్జా చేసిందని తెలిపారు’’ అని రాహుల్ పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘భద్రత మెరుగైతే.. జమ్మూ నుంచి లాల్‌చౌక్ వరకు భాజపాను యాత్ర నిర్వహించమనండి’’ అని సవాల్ విసిరారు. జోడో యాత్ర... దేశంలో ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దేశపౌరుల మద్దతుతో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కన్యాకుమారి నుంచి తుది గమ్యస్థానానికి చేరుకుంది. ప్రేమ సందేశం దేశమంతా వ్యాపించింది’’ అని ప్రియాంక తెలిపారు.
రాహుల్.. మోదీకి ధన్యవాదాలు చెప్పాలి
లాల్‌చౌక్‌లో కూడా త్రివర్ణపతాకం ఎగరేసే వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని, ఇందుకు మోదీకి రాహుల్‌గాంధీ ధన్యవాదాలు తెలపాలని భాజపా పేర్కొంది. ‘‘రాహుల్‌గాంధీ గర్వంతో లాల్‌చౌక్‌లో మువ్వన్నెల జెండా ఎగరవేశారు. ఈ పరిస్థితిని మోదీ, ఆయన ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు కశ్మీర్‌లో ప్రతి భారతీయుడూ జెండా ఎగరేయొచ్చు’’ అని భాజపా అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు.
యాత్ర సాగిందిలా..
* ఎక్కడి నుంచి ఎక్కడికి: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు..
* ఎప్పుడు ప్రారంభమైంది: 2022, సెప్టెంబరు 7న(కన్యాకుమారిలో)
* ఎన్ని రోజులు: 134
* ఎన్ని కిలోమీటర్లు: 4,084
* ఏయే రాష్ట్రాల్లో: 12 రాష్ట్రాలు (తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్) 2 కేంద్రపాలిత ప్రాంతాలు (దిల్లీ, జమ్మూకశ్మీర్)
* ఎన్ని చోట్ల ప్రసంగం: 12 బహిరంగ సభలు, 100కు పైగా కార్నర్ సమావేశాలు.. 13 పాత్రికేయ సమావేశాలు. దాదాపు 275 చోట్ల నడుస్తూ, 100 చోట్ల కూర్చొని ముఖాముఖిలు
* అధికారిక ముగింపు: నేడు శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరిగే సభతో
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్