జీవో-1పై పార్లమెంటులో మాట్లాడండి

రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవో 1పై పార్లమెంటులో మాట్లాడాలని తెదేపా ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.

Published : 30 Jan 2023 03:38 IST

కేంద్ర నిధుల మళ్లింపు, రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై గళమెత్తాలి
తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు నాయుడు

ఈనాడు, అమరావతి: రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక జీవో 1పై పార్లమెంటులో మాట్లాడాలని తెదేపా ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లిస్తున్న విషయాన్నీ ప్రస్తావించాలని చెప్పారు. మంగళవారం నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జగన్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక జీవోలు తీసుకొస్తూ ప్రజలను అణచివేస్తోంది. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వీటన్నింటిపైనా పార్లమెంటులో తెదేపా తరఫున గళమెత్తాలి’ అని సూచించారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, రావాల్సిన నిధులను ప్రస్తావించాలని చంద్రబాబు చెప్పారు. పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కనకమేడలను పరామర్శించిన చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బైపాస్‌ సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న రవీంద్ర కుమార్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు