రక్తపు మరకలను ఎవరు శుభ్రం చేశారో అవినాష్‌రెడ్డి చెప్పాలి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాష్‌రెడ్డి.. హత్య జరిగిన స్థలంలో రక్తపు మరకల్ని ఎవరు శుభ్రం చేశారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండు చేశారు.

Published : 30 Jan 2023 03:38 IST

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాష్‌రెడ్డి.. హత్య జరిగిన స్థలంలో రక్తపు మరకల్ని ఎవరు శుభ్రం చేశారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండు చేశారు. హత్య జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి ఎవరు వెళ్లారు? వెళ్లి ఏం చేశారో చెప్పాలని, ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టును కోరి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ప్రశ్నించారు. ‘వివేకా భౌతిక కాయాన్ని సందర్శించకుండానే బాబాయికి గుండెపోటు వచ్చిందని ఓసారి, చంద్రబాబు చంపేశారని మరోసారి మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడే వీరి హత్యా రాజకీయాలు బయటపడ్డాయి. సీబీఐ అధికారులు నోటీసులిచ్చిన వెంటనే విచారణకు హాజరు కాకుండా అవినాష్‌రెడ్డి 5 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? ఈ సమయంలో ఎవరి కాళ్లు, వేళ్లు పట్టుకుని బతిమాలారు.. ఈ 5 రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేసిన కార్యక్రమాలేంటి’ అని బీటెక్‌ రవి నిలదీశారు. ‘ఎంపీ పదవి కోసం అవినాష్‌రెడ్డి వైఎస్‌ కుటుంబంలో కలహాలు సృష్టించిన మాట వాస్తవం కాదా? ఇప్పడు ఏ మొహం పెట్టుకుని ఆయన వైఎస్‌ విజయమ్మను కలిశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు