Kotamreddy: ప్రశ్నిస్తే పగబట్టారా?

ప్రశ్నిస్తే ఎవరినైనా సహించేది లేదని వైకాపా ప్రభుత్వ పెద్దలు మరోసారి తమ చర్యలద్వారా స్పష్టం చేశారు.

Updated : 30 Jan 2023 08:32 IST

నెల్లూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాపింగ్‌
3 తరాలుగా సీఎం కుటుంబానికి సేవ చేస్తున్నా.. ఇలాంటి చర్యా?
సన్నిహితులవద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆవేదన

ఈనాడు, అమరావతి, నెల్లూరు, న్యూస్‌టుడే: ప్రశ్నిస్తే ఎవరినైనా సహించేది లేదని వైకాపా ప్రభుత్వ పెద్దలు మరోసారి తమ చర్యలద్వారా స్పష్టం చేశారు. వారి శైలి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే పగబడతామన్నట్టుగా ఉందా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన అధికార వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌తోపాటు ఆయనపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉంచడం దీనికి నిదర్శనమన్నట్టు స్పష్టమైంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు. ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంతు వచ్చినట్లుంది! తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఎమ్మెల్యే స్వయంగా బయటపెట్టారు. ‘ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ను పోలీసు అధికారులు ట్యాప్‌ చేయరు’ అని ఎమ్మెల్యే వర్గీయులు మండిపడ్డారు. ‘మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అధికారులు నిధులివ్వడం లేదు. రూ.10 విలువ పని చేస్తే అర్ధ రూపాయీ విడుదల కావడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన బారాషహీద్‌ దర్గా ప్రాంతంలో మసీదు నిర్మాణానికీ డబ్బులివ్వలేదు. ఇలాగైతే ప్రజలకేం సమాధానం చెప్పాలి?’ అంటూ ఇటీవల అధికారిక సమావేశంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ‘3 నెలల నుంచి నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు. ట్యాపింగ్‌ మొదలు పెట్టిన 1, 2 రోజుల్లోనే నాకు సమాచారం వచ్చింది’ అని శనివారం తనవద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేర్కొనడం ఆదివారం బయటకు వచ్చింది. ‘ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ను అధికారంలో ఉన్నవారు వాడతారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడమేంటి?’ అని ఆయన వారితో అన్నట్లు సమాచారం. తన డ్రైవరుతో మరో ఫోన్‌ తెప్పించి దానిని ఆ ఇంటెలిజెన్స్‌ సిబ్బందికి చూపిస్తూ.. ‘మీరు (పోలీసులు) ట్యాప్‌ చేస్తున్నారనే ఇలా మరో ఫోన్‌ వాడుతున్నా. ఒకటి కాదు 12 రకాల సిమ్‌లు ఉపయోగిస్తున్నా. ఫేస్‌టైం, టెలిగ్రామ్‌ కాల్స్‌ అయితే ఏ సాఫ్ట్‌వేర్‌ ట్యాప్‌ చేయలేదు. అవసరమైతే నా ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని నియమించాలని మీ అధికారులకు చెప్పండి’ అని ఆయన వారితో సరదాగా అన్నట్లు సమాచారం.

ఇదా నాకిచ్చిన గుర్తింపు?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ‘రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఇప్పుడుజగన్‌ వరకూ మూడు తరాలకు సేవ చేస్తున్నా. గతంలో జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కొని మరీ జగన్‌ ఓదార్పు యాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేయించగలిగా. పార్టీ అధికారంలోకొచ్చాక మంత్రి పదవి, స్పీకర్‌, ఉపసభాపతి, చీఫ్‌విప్‌, విప్‌, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికీ అర్హుడిని కాకుండాపోయానా?’ అని ఎమ్మెల్యే తన సన్నిహితులవద్ద వాపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు