విశాఖ ఉక్కు పై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి: వామపక్షాలు

విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు వామపక్ష పార్టీలు లేఖ రాశాయి.

Updated : 30 Jan 2023 06:21 IST

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు వామపక్ష పార్టీలు లేఖ రాశాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్‌), ఎంసీపీఐ (యు), సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఎస్‌యూసీఐ (సీ), ఫార్వర్డ్‌బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీల ప్రతినిధులు సంయుక్తంగా ఈ లేఖ రాశారు. ‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. దీన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి చర్చించడం సమంజసం. కర్మాగారంవద్ద సోమవారం అఖిలపక్ష పార్టీలతో పోరాట కమిటీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు వామపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. ప్రజలు పోరాడి సాధించుకున్న భారీ కర్మాగారం ఇది. కేంద్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లే పెట్టుబడి పెట్టింది. కానీ పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కర్మాగారం రూ.59,000 కోట్లకు పైగా చెల్లించింది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన దానిని దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, మన దేశంలోని అదానీ కంపెనీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు