సంక్షిప్త వార్తలు(6)

తెదేపా ప్రభుత్వం ఏర్పాటైతేనే తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

Updated : 31 Jan 2023 06:34 IST

తెదేపాతోనే తెలంగాణ ప్రజలకు మేలు: కాసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా ప్రభుత్వం ఏర్పాటైతేనే తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటవడానికి అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో కాసాని సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠానికి రాష్ట్రంలోని 1,300 మండలాలు, మున్సిపల్‌ డివిజన్లలో ఇంటింటికి తెదేపా కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టనున్నట్లు వివరించారు.


బడ్జెట్‌లో బీసీలకు నిధులు పెంచాలి: జాజుల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, దళిత బంధు తరహాలోనే బీసీ బంధును ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.


రూ.20 వేల కోట్లకు పెంచాలి: ఆర్‌.కృష్ణయ్య

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీల బడ్జెట్‌ను రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాలకు రూ.4 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లను కేటాయించాలన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లించాలన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీల్లో చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


కేంద్ర నిధుల దుర్వినియోగం
రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి ధ్వజం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణ: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి వాటిని దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. గుంటూరు జిల్లా భాజపా కార్యకర్తల సమావేశం సోమవారం తుళ్లూరు మండలం నెక్కల్లులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఏ రహదారి చూసినా గుంతలమయంగా ఉందని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో 22లక్షల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తే అవి నిర్మాణాలకు నోచుకోలేదు. ఒక్కో ఇంటికి రూ.1.8లక్షలు కేటాయిస్తే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇసుక, మద్యం మాటున పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా ప్రజలను వంచించింది. రాజధాని అమరావతికి భాజపా కట్టుబడి ఉంది. ఎవరు ఏం మాట్లాడినా అమరావతే ఏపీ రాజధాని’ అని ఉద్ఘాటించారు.


ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిసిన ముద్రగడ

కాకినాడ, న్యూస్‌టుడే: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార పక్షానికి చెందిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కలిశారు. కాకినాడలోని రాయల్‌పార్కు హోటల్‌లో సోమవారం ఇరువురూ భేటీ అయ్యారు. ముద్రగడ పద్మనాభం తన వ్యక్తిగత పని నిమిత్తం ద్వారంపూడిని కలిసినట్లు తెలుస్తోంది. ఓ స్థలం విషయంలో నెలకొన్న వివాదంపై చర్చించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.  వ్యక్తిగతమైన అంశంపైనే ఈ భేటీ జరిగిందా.. రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అంశం చర్చనీయాంశమైంది.


గందరగోళంలో ఉద్యోగులు: బుద్ద

అనకాపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గందరగోళానికి లోనవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. అనకాపల్లి తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.


సీఎం జగన్‌ చెట్లు నరికించారని చదువుకోవాలేమో?: సోమిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అశోకుడు చెట్లు నాటిస్తే...సీఎం జగన్‌ చెట్లు నరికించారని భావితరాలు చదువుకునేలా చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  సోమవారం ట్విటర్‌లో విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు