రాజ్‌భవన్‌ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడమా!
‘బ్రిటిష్ కాలంలో గవర్నర్ పదవికి ఒక అర్థం ఉండేది. పైన వైస్రాయ్ ఉంటే కింద గవర్నర్ ఉండేవారు.
గవర్నర్ వ్యవస్థను మోదీ అలానే వాడుకుంటున్నారు
ముఖ్యమంత్రిగా నీతులు చెప్పి.. ప్రధానిగా తుంగలో తొక్కారు
రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం..
రాష్ట్ర భాజపా ఎంపీలు గల్లీలో కాదు.. దిల్లీలో మాట్లాడాలి
మంత్రి కేటీఆర్ ధ్వజం
సిరిసిల్ల, ఈనాడు డిజిటల్: ‘బ్రిటిష్ కాలంలో గవర్నర్ పదవికి ఒక అర్థం ఉండేది. పైన వైస్రాయ్ ఉంటే కింద గవర్నర్ ఉండేవారు. ప్రధాని పేరును వైస్రాయ్‌గానైనా మార్చుకోవాలి.. లేదంటే గవర్నర్ వ్యవస్థనైనా ఎత్తివేయాలి.. ఈ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రధాని.. ఇతరులకు చెప్పే ముందు ఆలోచించుకుంటే మంచిది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు పరీక్షలను పరిశీలించారు. తర్వాత సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థపైనా.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు.. పార్టీలకు అనుకూలంగా.. చర్చల్లో పాల్గొనడం మానుకుంటే మంచిది. రాజభవన్‌ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. దేశంలో బ్రిటిష్ కాలపు చిహ్నాలు పోవాలని రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చినట్లు గతంలో మోదీ చెప్పారు. మరి గవర్నర్ల వ్యవస్థ కూడా బ్రిటిష్‌వారు పెట్టిందే కదా? అది ఎందుకు ఉండాలి.? ఆ పదవి వల్ల ఎవరికి ఉపయోగం? పీఎం, సీఎంలను ప్రజలు ఎన్నుకుంటున్నారు.. మరి గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారు?. ఈ వ్యవస్థ వద్దని సర్కారియా, పుంఛీ కమిషన్లే చెప్పాయి. రాజకీయాలు వదిలి రెండేళ్లు ఖాళీగా ఉన్నవారికే గవర్నర్ పదవి ఇవ్వాలని మోదీ గతంలో అన్నారు.. ప్రస్తుతం పాటించడం లేదు. ముఖ్యమంత్రిగా నీతులు చెప్పిన మోదీ.. ప్రధానిగా తుంగలో తొక్కారు.
దుర్మార్గాలను సవరించుకునేందుకైనా నిధులివ్వాలి..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం నెరవేర్చలేదు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, విద్యా సంస్థలు.. పారిశ్రామిక కారిడార్‌లు.. పరిశ్రమలకు రాయితీలు.. ఐటీ రంగం విస్తరణ.. ఇలా ఎన్నో రకాల వాగ్దానాలను పార్లమెంటు సాక్షిగా చట్టంలో పొందుపరిచినా వాటిలో ఏవీ నెరవేర్చలేదు. మోదీ అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ తొమ్మిదవది.. ఇదే చివరి బడ్జెట్.. నేనేమీ శాపం పెట్టడం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ తూతూ మంత్రమే.. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇదే చివరి అవకాశం. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికైనా మేల్కొని తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎనిమిదేళ్లు చేసిన దుర్మార్గాలను సవరించుకునేందుకైనా ఈ బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలి.
మా పన్నులను ఇతర రాష్ట్రాల్లో వాడుకున్నారు
రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.3.68 లక్షల కోట్లు కడితే.. రాజ్యాంగబద్ధంగా.. ఆర్థిక సంఘం నిబంధన ప్రకారం రూ.1.69 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో వసూలు చేసిన పన్నులను వేరే రాష్ట్రాల్లో వినియోగించారు. దీనికి ఉదాహరణే రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అధోగతి. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. ఎనిమిదేళ్లలో కొత్త రైల్వే లైను రాలేదు.. ఉన్నవి కూడా పూర్తి చేయలేదు. కాజీపేటకు కోచ్ ప్యాక్టరీ అడిగితే ఇక్కడ అవసరమే లేదంటారు. కానీ, మహారాష్ట్రలోని లాతూర్‌లో ఒకటి.. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మరొకటి పెట్టారు. ఏడాదికి రూ.1000 కోట్లు నష్టం వస్తుందని రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలు ఎత్తివేయడం కన్నా అనాగరిక చర్య మరొకటి లేదు. మోదీ కూడా సీనియర్ సిటిజన్‌గా మారతారు.. అదైనా గుర్తుంచుకుని రాయితీలు పునరుద్ధరించాలి. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర భాజపా ఎంపీలు మేల్కొనాలి. నలుగురున్నా.. రాష్ట్రానికి నయాపైసా తేలేదు. ఇక్కడ గల్లీలో తిరుగుతూ సిల్లీ మాటలు మాట్లాడటం కాదు.. కేసీఆర్‌ను బూతులు తిడుతూ.. తిరగడం కాదు.. చేతనైతే దిల్లీలో మాట్లాడాలి. ఎంపీలుగా చేయాల్సిన పని చేయాలి.
విద్యా సంస్థలపైనా వివక్ష
రాష్ట్రానికి రావాల్సిన ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదు. కొత్తగా వైద్య కళాశాలలు ఇవ్వలేదు. ట్రిపుల్‌ఐటీ, ఐఐఎం వంటి సంస్థలనూ కేటాయించలేదు. సాగునీటి రంగంలో కాళేశ్వరం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో దేనికైనా ఒకదానికి జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ అతీగతీ లేదు. నేతన్నల కోసం మెగా పవర్‌లూం క్లస్టర్ తొమ్మిదేళ్లుగా అడుగుతూనే ఉన్నా స్పందన లేదు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్‌ను అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఎకరానికి సంవత్సరంలో రూ.10 వేలు ఇవ్వాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nani: కొత్త దర్శకులకు ఛాన్సులు.. నాని ఖాతాలో హిట్లు
-
Politics News
ashok chavan: మోదీ బండారం బయటపడుతుందనే రాహుల్‌పై అనర్హత: అశోక్ చవాన్
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!