ప్రజల్లో పోలీసులపై విశ్వాసం సన్నగిల్లింది

ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకుండా పోయిందని, పోలీసు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 31 Jan 2023 08:38 IST

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ధ్వజం

అనంతపురం, న్యూస్‌టుడే: ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకుండా పోయిందని, పోలీసు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా వర్గీయుల దాడిలో గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడిపత్రి ఐటీడీపీ ఇన్‌ఛార్జి గండికోట కార్తిక్‌ను సోమవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం  విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లిందని ఆరోపించారు. డీఎస్పీ చైతన్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం జరిగిన ఘటనపై సుమోటో కేసు నమోదు చేసి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. తాము ఎక్కడికీ వెళ్లమని.. తాడిపత్రిలోనే ఉంటామన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనిషిగా జీవిస్తున్నందునే రాష్ట్రంలో ఏకైక తెదేపా మున్సిపల్‌ ఛైర్మన్‌గా తనను గెలిపించారన్నారు. శాంతిభద్రతలు దారుణంగా ఉన్నా జిల్లా ఎస్పీ, డీఐజీలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మానవ హక్కుల కమిషన్‌ నుంచి ఫిర్యాదు రావడంతో ప్రస్తుతం పోలీసులు  పరుగులు తీస్తున్నారన్నారు. ఆదివారం నాటి ఘటనపై ఫిర్యాదు చేస్తాం.. సెక్షన్‌ 307 కింద కేసు కట్టే ధైర్యం మీకుందా? అంటూ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు