Nara Lokesh: ప్రత్యేక విమానాల్లో పర్యటనలేనా.. ప్రత్యేక హోదా సంగతేంటి?

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి జగన్‌.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Updated : 31 Jan 2023 07:13 IST

అవినాష్‌రెడ్డిని కాపాడేందుకే దిల్లీ యాత్ర
సీఎం జగన్‌పై యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ధ్వజం
అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ క్యాలెండర్‌

ఈనాడు డిజిటల్‌- చిత్తూరు, న్యూస్‌టుడే- వి.కోట, పలమనేరు: కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి జగన్‌.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక రూ.కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానాల్లో దిల్లీకి వెళ్లడమే తప్ప ప్రత్యేక హోదా తెచ్చింది లేదని ఆక్షేపించారు. దిల్లీ పెద్దల కాళ్లు మొక్కుతున్నారని.. రాష్ట్రం కోసం మాత్రం నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. జగన్‌ నువ్వు అసలు రాయలసీమ బిడ్డవేనా అని ఆయన ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడంతో ఆయన్ను కాపాడేందుకే ముఖ్యమంత్రి దిల్లీ వెళ్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర నాలుగో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వి.కోట మండలంలో 14.6 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. వడ్డెరలు, ముస్లింలు, యువతతో సమావేశమై మాట్లాడారు.

175 నియోజకవర్గాల్లోనూ ఏపీఐఐసీ క్లస్టర్లు

‘రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే జగన్‌కు, లోకేశ్‌కు ఏం కాదు. ఇక్కడి యువత భవితే నాశనమవుతుంది. తెదేపా అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. 175 నియోజకవర్గాల్లో ఏపీఐఐసీ క్లస్టర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తాం. ముస్లిం రిజర్వేషన్‌ కేసును కోర్టులో వాదించడానికి ఈ ప్రభుత్వం కనీసం న్యాయవాదిని కూడా పెట్టలేదు. తెదేపా ఆ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయి సొంత ఖర్చుతో న్యాయవాదిని పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మైనారిటీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తాం’ అని చెప్పారు. పలమనేరులో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మైనారిటీ బాలిక మిస్బా, ఎమ్మిగనూరులో కరోనా లాక్‌డౌన్‌లో వైకాపా నాయకులు అత్యాచారం చేసి చంపేసిన హజీరాబీ, అధికార పార్టీ వేధింపులతో నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కుటుంబాలకు న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. వడ్డెర్లకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పిస్తామన్నారు. కర్ణాటక సరిహద్దులోని గంధారమాకులపల్లె నుంచి దాసార్లపల్లి వరకు 3 కి.మీ. మేర ఆ రాష్ట్ర పోలీసులు పాదయాత్రకు బందోబస్తు కల్పించారు.

చమురు ధరలు పెంచి దోపిడీ

పాదయాత్ర కర్ణాటకలోని పొంతనహళ్లికి చేరినప్పుడు లోకేశ్‌ అక్కడ తన వాహనానికి డీజిల్‌ పట్టించారు. కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయని.. ఏపీలో ధరలు పెంచి ప్రభుత్వం జనాన్ని దోచుకుంటోందని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని