రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం: పల్లా

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Published : 31 Jan 2023 03:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లేని వాటిని ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ఆత్మహత్యలకు వాళ్లే పురికొల్పుతున్నారని ఆరోపించారు. జాతీయ క్రైమ్‌ రికార్డు బ్యూరో లెక్కలనూ వక్రీకరిస్తున్నారని, తెలంగాణలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో చెప్పిందని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 400 శాతం తగ్గాయన్నారు. శాసనసభ్యులు గువ్వల బాలరాజు, మండలి సభ్యులు ఎం.ఎస్‌.ప్రభాకర్‌, వి.గంగాధర్‌గౌడ్‌లతో కలిసి సోమవారం ఆయన భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఓ వైపు కేంద్ర మంత్రి తోమర్‌ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెబుతుంటే.. రాష్ట్రంలో 10 వేల ఆత్మహత్యలు జరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు’’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు బాలరాజు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని