డీడీఎల్‌జే మంత్రాన్ని పఠిస్తున్న మోదీ సర్కారు: కాంగ్రెస్‌

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత దాచాలని చూసినా చైనా విషయంలో తన విధానం విఫలమైందనే వాస్తవాన్ని మరుగుపరచలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ సోమవారం ఉద్ఘాటించారు.

Updated : 31 Jan 2023 06:25 IST

దిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత దాచాలని చూసినా చైనా విషయంలో తన విధానం విఫలమైందనే వాస్తవాన్ని మరుగుపరచలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ సోమవారం ఉద్ఘాటించారు. భారీ విస్తీర్ణంలో భారత భూభాగాన్ని చైనా హస్తగతం చేసుకుందనే వాస్తవాన్ని మోదీ సర్కారు ఇక ఏమాత్రం కప్పిపుచ్చలేదని ఆయన అన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ 2017లో చైనా రాయబారితో సమావేశమయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని విమర్శించారు. జైశంకర్‌ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షమైన రిపబ్లికన్‌ పార్టీ ప్రముఖులతోనూ సమావేశమయ్యేవారని జైరాం గుర్తుచేశారు. లద్దాఖ్‌లో చైనా దురాక్రమణపై మోదీ ప్రభుత్వ విధానం డి.డి.ఎల్‌.జెలా ఉందని రమేశ్‌ వ్యంగ్య విమర్శ చేశారు. డి.డి.ఎల్‌.జె అనేది బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’కు పొడి అక్షరాలుగా ప్రసిద్ధమైనా, జైరాం రమేశ్‌ దాన్ని డినై (తిరస్కరించు), డిస్‌ట్రాక్ట్‌ (దృష్టి మళ్లించు), లై (అబద్ధమాడు), జస్టిఫై (సమర్థించుకో)గా మార్చి ప్రయోగించారు. మోదీ సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై విరుచుకుపడేకన్నా లద్దాఖ్‌లో దెప్సాంగ్‌, దెమ్‌ చోక్‌ ప్రాంతాల నుంచి చైనా సేనలను వెళ్లగొట్టడంపై శ్రద్ధ చూపాలని రమేశ్‌ హితవు చెప్పారు. 2020 మే నెల నుంచి మోదీ ప్రభుత్వం లద్దాఖ్‌లోని 65 గస్తీ కేంద్రాలకు 26 కేంద్రాలను చైనాకు జారవిడచుకుందని ఆయన అన్నారు. చైనా సమస్యపై మోదీ సర్కారు పార్లమెంటులో, పార్లమెంటు స్థాయీ సంఘాల్లో చర్చ జరిపి ఉండాల్సిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని