నేడు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్‌ వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు.

Updated : 31 Jan 2023 06:23 IST

కమలాపూర్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్‌ వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ ఎంజీపీ భవనాలు, కస్తూర్బా పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కుల సంఘాల భవనాల సముదాయం, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఈటలను ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించగా.. తనను ఎందుకు ఆహ్వానించడం లేదని మంత్రి దయాకర్‌రావు, హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుకు ఫోన్‌ చేయగా వారు స్పందించలేదని అన్నారు. తనతోపాటు ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎంపీ బండి సంజయ్‌ను కూడా ఆహ్వానించలేదని ఈటల మండిపడ్డారు. గతంలో కట్టించిన భవనాలను ఇప్పుడు ప్రారంభించడం సిగ్గుచేటని విమర్శించారు.

భాజపా, కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

కమలాపూర్‌, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 37 మంది నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌ చేసి మడికొండ పీటీసీకి తరలించినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సంజీవ్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అరెస్ట్‌ చేశామని ఆయన పేర్కొన్నారు.
భాజపా కార్యకర్తల అరెస్టులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఖండించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు