ప్రభుత్వం జీపీఎఫ్‌ సొమ్మును దోచుకుంది

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతభత్యాలు సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం.. వారు దాచుకునే జీపీఎఫ్‌ సొమ్ముని కాజేసిందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు.

Published : 31 Jan 2023 05:05 IST

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతభత్యాలు సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం.. వారు దాచుకునే జీపీఎఫ్‌ సొమ్ముని కాజేసిందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ముని ప్రభుత్వం వాడుకోవడం దేశంలో ఏపీలోనే జరుగుతోందని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒకటో తేదీకి జీతాలివ్వలేదు. సీపీఎస్‌ రద్దు చేయలేదు. డీఏ బకాయిలు చెల్లించదు. జీపీఎఫ్‌ సొమ్ముకి గ్యారెంటీ లేదు. ఆఖరికి భవిష్యత్తు కోసం ఉద్యోగులు దాచుకున్న సీపీఎస్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లింపులూ ఆపేసిన ఇదీ ఓ ప్రభుత్వమేనా? జీతాలు రాకపోతే  చచ్చిపోతారా..ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం నేర్చుకోవాలంటూ మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.2,100 కోట్లను ఇప్పటి వరకు ఇవ్వలేదు. పదవీవిరమణ ప్రయోజనాలు కల్పించలేకే వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ సంఘాలు ఒక తాటిపైకి వస్తే ప్రభుత్వానికి ముప్పని సంఘాల నేతల మధ్య కులాలు, పార్టీల పేరుతో చిచ్చుపెట్టారు. అప్పులు పుడితే తప్ప జీతాలివ్వలేని ప్రభుత్వాన్ని నమ్మడం ఉద్యోగ సంఘాల మూర్ఖత్వమే’’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల్ని వేధిస్తున్నారు : ఏఎస్‌ రామకృష్ణ

జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అడుగడుగునా వేధిస్తోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆకస్మిక తనిఖీల పేరుతో పాఠశాలలకు వెళ్లి అదిలేదు, ఇదిలేదంటూ ఉపాధ్యాయుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, నోటీసులివ్వడం, సస్పెండ్‌ చేయడం, బెదిరించడం తగదు. ఆయన వ్యవహారశైలి ఉపాధ్యాయుల్ని అవమానించేలా ఉంది’’ అని రామకృష్ణ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు