22 మంది ఎంపీలతో జగన్‌ ఏం చేస్తున్నారు?

తన పార్టీ తరఫున 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన జగన్‌ దానికోసం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Published : 31 Jan 2023 05:05 IST

విద్యార్థి, యువజన సంఘాల సమర బస్సుయాత్ర సభలో చలసాని శ్రీనివాస్‌

ఈనాడు, అమరావతి: తన పార్టీ తరఫున 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన జగన్‌ దానికోసం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే మూడున్నరేళ్లుగా జగన్‌ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా ఏది మామయ్యా అంటూ విద్యార్థులంతా సీఎంను నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ నిర్వహిస్తున్న సమర బస్సు యాత్ర సోమవారం విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్ష పార్టీల నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సదస్సులో చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ఏపీ ఎంపీలకు దమ్మూ, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదాపై పార్లమెంటులో మోదీని నిలదీయాలని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ... వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను దిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. ‘కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి కేంద్రం వద్ద డబ్బులు ఉన్నాయి. ప్రత్యేక హోదాకు, రైతులను ఆదుకోవడానికి లేవా?’ అని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ సహా విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని