Nara Lokesh: ఒక్క అవకాశమంటూ బీసీల గొంతుకోశారు

ఒక్క అవకాశం ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన జగన్‌.. బీసీల గొంతు కోశారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’లో ఆక్షేపించారు.

Published : 01 Feb 2023 06:27 IST

అధికారంలోకి వచ్చాక వైకాపా వారు 26 మంది బీసీల్ని చంపారు
2,650 మందిపై అక్రమకేసులు పెట్టారు
‘యువగళం’లో ప్రభుత్వంపై లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె: ఒక్క అవకాశం ఇవ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన జగన్‌.. బీసీల గొంతు కోశారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’లో ఆక్షేపించారు. తెదేపా హయాంలో 90 శాతం రాయితీతో రూ.10 లక్షల దాకా రుణాలిచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని, పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు 26 మంది బీసీలను బలి తీసుకున్నారని, 2,650 మందిపై అక్రమకేసులు పెట్టారన్నారు. బీసీల అభ్యున్నతికి వైకాపానే కృషి చేసిందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెబుతున్నారని, ఈ అంశంపై చర్చకు సిద్ధమని లోకేశ్‌ సవాలు విసిరారు. ఎస్సీల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వచ్చినా, లేదంటే పాదయాత్ర షెడ్యూల్‌లో పేర్కొన్న ఏ గ్రామానికైనా సీఎం జగన్‌ హాజరైనా బదులిస్తానని చెప్పారు. చిత్తూరు జిల్లా వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లో లోకేశ్‌ మంగళవారం పాదయాత్ర చేస్తూ రైతులు, కూలీలు, కురబ, బీసీలతో సమావేశమయ్యారు. మహిళలు, చిన్నారులు, యువత అధిక సంఖ్యలో తరలి రావడంతో బైరెడ్డిపల్లె కూడలి కిక్కిరిసింది. కార్యకర్తలు గజమాలతో యువనేతకు స్వాగతం పలికారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ స్వగ్రామం తోటకనుమకు చేసిందేమీ లేదని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. పుట్టి పెరిగిన ఊరినే అభివృద్ధి చేయని వ్యక్తి నియోజకవర్గాన్ని ఎలా బాగుచేస్తారని ప్రశ్నించారు. కష్టపడి రూ.కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్న వారి నుంచి గనులు లాక్కోవడం తప్ప ఆయనకు ఏమీ రాదని ధ్వజమెత్తారు. 

అక్రమ కేసుల్ని తొలగిస్తాం

‘పెనుకొండ నియోజకవర్గంలో కురబ సామాజికవర్గానికి చెందిన సబితమ్మ రాజకీయంగా ఎదుగుతోందని ఓర్చుకోలేక అధికార పార్టీ నాయకులు ఆమె క్వారీని అక్రమంగా ఆపేశారు. కేసులు నమోదు చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రత్యేక జీవో తెచ్చి.. బీసీలపై నమోదైన అక్రమకేసుల్ని తొలగిస్తాం’ అని లోకేశ్‌ స్పష్టంచేశారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, నగరి తెదేపా ఇన్‌ఛార్జి భానుప్రకాష్‌, నాయకులు శ్రీధర్‌వర్మ, బీవీ వెంకటరాముడు, కోదండయాదవ్‌, సందీప్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


యువనేతకు సమస్యల మొర

వి.కోట మండలం కస్తూరినగరంలో జాతీయ రహదారి పక్కనే సపోటాలు అమ్ముతున్న సుబ్రహ్మణ్యంను లోకేశ్‌ పలకరించారు. కుమారుడిని బీటెక్‌ చదివించినా ఉద్యోగం లేక తనతోపాటు సపోటాలు అమ్ముతున్నాడని ఆయన వాపోయారు. కుమ్మరిమడుగులో 80 ఏళ్ల చిన్నరామప్ప మాట్లాడుతూ... తనకు పింఛను ఇవ్వడంలేదని వైకాపా నాయకులను అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అన్నారని తెలిపారు. బైరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి వద్ద పొలంలో నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో లోకేశ్‌ మాట్లాడారు. వైకాపా పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, ఇంటి పట్టాల కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వలేదని వారు వాపోయారు.


పాదయాత్ర 5వ రోజు

ఎక్కడెక్కడ: చిత్తూరు జిల్లా వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లో

ఎంతదూరం: 14 కిలోమీటర్లు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని