కేంద్ర వైఫల్యాలు తెలిపేందుకే రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ

కేంద్ర ప్రభుత్వ ఎనిమిదేళ్ల వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు.. ప్రజల నిరసనను కేంద్రానికి చూపేందుకే ఆప్‌తో కలిసి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలిపారు.

Published : 01 Feb 2023 03:56 IST

ఆమెపై మాకున్న గౌరవం మరెవరికీ లేదేమో...
భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఎనిమిదేళ్ల వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు.. ప్రజల నిరసనను కేంద్రానికి చూపేందుకే ఆప్‌తో కలిసి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలిపారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ అనంతరం భారాస ఎంపీలతో కలిసి ఆయన దిల్లీలోని విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని.. రాష్ట్రపతిపై తమకున్న గౌరవం మరెవరికీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో సామాజిక, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారిత వంటి పెద్ద పెద్ద మాటలున్నాయని.. కానీ, దేశవ్యాప్త సమస్యలైన నిరుద్యోగిత, ధరల పెంపు, విద్యా, వైద్యం తదితరాల ప్రస్తావన లేదన్నారు. తెలంగాణతో పాటు దిల్లీలోనూ గవర్నర్‌ సమస్య ఉందన్నారు. బడ్జెట్‌ ఆమోదం విషయంలో గవర్నర్‌ అధికారిని పంపి పరిష్కరించుకుంటే సరిపోయేదానికి తాము కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమిళనాడు గవర్నర్‌ శాసనసభ నుంచే వాకౌట్‌ చేశారని గుర్తుచేశారు. ఈ సమస్యలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టించేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన చెప్పారు. గవర్నర్లతో సమస్యలున్న ఇతర రాష్ట్రాల పార్టీలు కలిసివస్తాయని.. ఈ రోజు వారిని సంప్రదించడంలో తాను విఫలమయ్యాయని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మేం లేవనెత్తిన అంశాలను అసలు పట్టించుకోలేదు: నామా

రాష్ట్రపతిపై తమకు అపారమైన గౌరవం ఉందని భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రసంగంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును చేర్చాలని తాము చెప్పినా ఆ మాట చేర్చలేదని పేర్కొన్నారు. పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న డిమాండ్‌నూ పట్టించుకోలేదన్నారు. అఖిలపక్ష సమావేశంలో తాము లేవనెత్తిన కనీస మద్దతు ధర చట్టం, రైతు నాయకులపై పెట్టిన కేసుల ఉపసంహరణ అంశాలను అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాలా ఇవ్వలేదని.. కానీ, రాష్ట్రపతి ప్రసంగంలో కళాశాలల ప్రస్తావన తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు కేంద్రం చేసిందేంలేదని ఆరోపించారు. రానున్న సమావేశాల్లో ప్రతి అంశంపైనా నిలదీస్తామని హెచ్చరించారు. సమావేశంలో భారాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీలు బొర్లకుంట వెంకటేశ్‌ నేత, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, దివకొండ దామోదర్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని