కేసీఆర్‌ మోడల్‌ అంటే విధ్వంసకర నమూనానే: ప్రొఫెసర్‌ కోదండరాం

‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాసను భారాసగా మార్చి దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు.

Published : 01 Feb 2023 03:52 IST

ఈనాడు, దిల్లీ: ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాసను భారాసగా మార్చి దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్యను పూర్తిగా పరిష్కరించారని ఆయన జాతీయ రాజకీయాలపై మాట్లాడుతున్నారు? ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ఉంది. కేసీఆర్‌ మోడల్‌ అంటే విధ్వంసకర నమూనానే’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో తెజస ఆధ్వర్యంలో ‘‘తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలన-అభివృద్ధి-వాస్తవాలు’’ అనే అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ఇందులో కోదండరాం మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందని, ఆరోగ్యశ్రీ, బోధన రుసుముల నిధులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంచారని విమర్శించారు. కేసీఆర్‌ వ్యవసాయ విధానం గుప్పెడు మంది భూస్వాములకు లాభం చేకూర్చేలా ఉండడంతో చిన్న, సన్నకారు రైతులకు భరోసా లేకుండా పోయిందన్నారు. విశ్రాంత ఆచార్యుడు, ఆర్థికవేత్త డి.ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు భారీగా దారి మళ్లాయని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు కేటాయించిన నిధుల్లో దాదాపు 38% వ్యయం చేయలేదన్నారు. ప్రొఫెసర్‌ అజయ్‌ గుడవర్తి మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో త్వరలోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంతో పాటు సామాజిక సంక్షోభం రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని