తెదేపా బ్యానర్ల ధ్వంసం

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నారా లోకేశ్‌ పర్యటన ముగియగానే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు.

Published : 01 Feb 2023 03:58 IST

అడ్డుకోబోయిన పార్టీ శ్రేణులపై దాడి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నారా లోకేశ్‌ పర్యటన ముగియగానే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ తెదేపా బ్యానర్లను చించేయడంతోపాటు అడ్డుకోబోయిన కార్యకర్తలు హేమగిరి, శేషు, బాలాజీపై దాడికి దిగారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం శ్రేణులపైకి దూసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు స్థానిక ఎంపీపీ రెడ్డెప్ప రావడం, ‘యువగళం’ కార్యక్రమం ముగించుకుని తెదేపా కార్యకర్తలు భారీగా అటువైపు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే జాతీయ రహదారిపై సుమారు 15 నిమిషాలపాటు గొడవ జరగడం గమనార్హం. ఒకానొక సమయంలో ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పంపించేందుకు యత్నించారు. వైకాపా కార్యకర్తలు మాత్రం స్టేషన్‌ ఎదుటే నిలబడ్డారు. పోలీసులు వారిని బతిమలాడి అక్కడ నుంచి పంపాలని చూసినప్పటికీ వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత కృష్ణమూర్తికి పోలీసులు సర్దిచెప్పడంతో కార్యకర్తలతో కలిసి వెనక్కు వెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని