పార్లమెంటులో ఆహ్లాదకర వాతావరణం

తొలిరోజు పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అధికార భాజపా, విపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక మాటలు నడిచాయి.

Updated : 01 Feb 2023 06:28 IST

అధికార విపక్ష పార్టీల స్నేహపూర్వక కలయిక
శ్రీనగర్‌లోనే కొందరు కాంగ్రెస్‌ సభ్యులు.. సభకు గైర్హాజరు

దిల్లీ: తొలిరోజు పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అధికార భాజపా, విపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక మాటలు నడిచాయి. భారత్‌ జోడో యాత్ర ముగింపుతో శ్రీనగర్‌లోనే ఉండిపోయిన కొందరు కాంగ్రెస్‌ సభ్యులు.. వాతావరణం అనుకూలించక సభకు హాజరుకాలేకపోయారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయిన సోనియా గాంధీ మొదటి వరుసలో కూర్చున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సోనియాను పలకరించారు. సమీపంలోనే కూర్చున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ ఆమెతో అరగంటకుపైగా మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. రాజకీయ బద్ధ శత్రువులైన ఏఐఏడీఎంకే, డీఎంకేకు చెందిన ఎం.తంబిదురై, టీఆర్‌ బాలు ఆలింగనం చేసుకున్నారు. ఐదుగురు కూర్చుండే బెంచ్‌పై ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీకి చెందిన ఎంపీలతో పాటు భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు(మొత్తం ఆరుగురు) కూర్చున్నారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత చిరాగ్‌ పాసవాన్‌ తల్లి ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. అటు సభ ప్రారంభానికి ముందు భాజపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన జేపీ నడ్డాకు ఆ పార్టీ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు