రైతు పథకాలను అటకెక్కించిన సీఎం జగన్‌

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఎరువులు దొరకడం లేదని.. సూక్ష్మపోషకాలు, రాయితీ విత్తనాల పంపిణీ, పెట్టుబడి రాయితీ, యంత్ర సేద్యం తదితర పథకాలనూ అటకెక్కించారని పలువురు తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Updated : 01 Feb 2023 06:28 IST

తెదేపా నేతల ధ్వజం
మిరప, పత్తి రైతులతో 2న రచ్చబండ

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఎరువులు దొరకడం లేదని.. సూక్ష్మపోషకాలు, రాయితీ విత్తనాల పంపిణీ, పెట్టుబడి రాయితీ, యంత్ర సేద్యం తదితర పథకాలనూ అటకెక్కించారని పలువురు తెదేపా నేతలు ధ్వజమెత్తారు. కడప జిల్లా రైతులకే బిందు, తుంపర సేద్య పరికరాలు అందించలేని సీఎం జగన్‌.. రాష్ట్ర రైతాంగాన్ని ఉద్ధరిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనానికి తెదేపా ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీ సభ్యుల బృందం మంగళవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో రైతుల వెతలు, వ్యవసాయ రంగ దుస్థితిపై సవివర నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టనున్నట్లు వెల్లడించారు. నల్లి, గులాబీ పురుగుతో నష్టపోయిన మిరప, పత్తి రైతులతో ఫిబ్రవరి 2న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘వ్యవసాయశాఖకు 2020-21లో రూ.20వేల కోట్లు కేటాయించి రూ.7వేల కోట్లు ఖర్చు చేసినప్పుడే జగన్‌రెడ్డికి రైతులపై ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమైంది. ధాన్యం రైతులు నాలుగేళ్లలో రూ.60వేల కోట్లు నష్టపోయారు. నెల్లూరు జిల్లాలోనే క్వింటాల్‌కు రూ.400 కోట్లు కోల్పోయారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. తెలంగాణలో 70లక్షల టన్నుల ధాన్యం కొంటే... ఆంధ్రప్రదేశ్‌లో 29లక్షల టన్నులే కొనుగోలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సీబీఐ భయంతో దాక్కున్నారు...’ అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ధాన్యం రైతుల సమస్యలపై 16 ప్రశ్నలతో కూడిన వినతిపత్రాన్ని సీఎం జగన్‌కు పంపుతున్నట్లు తెలిపారు.


రైతుల భూమి పత్రాలపై జగన్‌ బొమ్మలా?

రైతుల భూముల పత్రాలపై, హద్దురాళ్లపై తన చిత్రాలు వేయాలనే నిర్ణయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండు చేశారు. భూసర్వే పేరుతో రైతుల భూములను కొట్టేసేందుకు జగన్‌ ప్రభుత్వంలోని బ్రోకర్లు సిద్ధమయ్యారని విమర్శించారు. ‘రైతు భరోసా పంపిణీలో వాస్తవమెంతో తక్షణమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అమూల్‌ ముసుగులో రాష్ట్రంలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేయాలనేదే జగన్‌రెడ్డి కుట్ర. పాడి రైతుల్ని ప్రలోభపెట్టి, బెదిరించి మరీ అమూల్‌కు పాలు పోయించడం దుర్మార్గం...’ అని ఆయన ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు